వారణాసిలో 1800 కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. స్థానిక ఎల్‌టి కాలేజీలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకం వంటశాలను ప్రారంభించారు. ఈ వంటశాల లక్ష మంది విద్యార్థులకు వండి వడ్డించే సామర్థ్యం కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీకి ఇది మొదటి పర్యటన. వారణాసిలో జరిగే మూడు రోజుల జాతీయ విద్యావిధానం సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు 1,800 కోట్ల మౌలికరంగ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వారణాసి రూపు రేఖలు మారిపోతాయని ఆయన అన్నారు. ట్రాఫిక్‌ జాంల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని, పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ విద్యావిధానం గురించి ప్రస్తావిస్తూ, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, భారతీయ ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని తిరిగి పునరుద్దరిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్‌కు భారత్‌ హబ్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. కరోనా నుంచి భారత్‌ శరవేగంగా కోలుకుందన్నారు. అలాగే ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ది చెందిన ఆర్థికవ్యవస్థలో భారత్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. స్టార్టప్‌లలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో భారత్‌ ఉందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటిష్ వారు భారత్‌ను నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు ప్రధాని మోదీ. భారతీయులను బానిసలుగా మార్చారని అన్నారు. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ పార్టీ ప్రతపక్ష నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ మోదీ పర్యటన పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పడు అక్షయపాత్రకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం మోదీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు

Post a Comment

0Comments

Post a Comment (0)