అగ్నిపథ్‌తో ఆర్మీ వ్యవస్థ నాశనం

Telugu Lo Computer
0


భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్‌ అని కార్గిల్‌ హీరో, రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్‌ టర్మ్‌గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీకి చేటు చేస్తాయని స్పష్టం చేశారు. ఆర్మీకి ఇలాంటివి మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తాయని హెచ్చరించారు. నాలుగేండ్ల శిక్షణ పేరుతో అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని, మరి తుది పరీక్షలో ఎంపికకాని అభ్యర్థుల పరిస్థితేంటి? వాళ్లు ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపుల్లో చేరితే? ఆ గ్రూపుల్లో చేరరని ఆర్మీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. శిక్షణ ఇచ్చేప్పుడు దేశ సాయుధ దళాల రహస్యాలు కొన్నైనా తెలిసే అవకాశం ఉంటుందని, మరి వారిపై నిఘాను కొనసాగిస్తారా? ఎంతమందిపై నిఘా పెట్టగలరు? అని సందేహం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్‌ నుంచి దేశానికి ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో అగ్నిపథ్‌ను అమలు చేస్తే సంస్థాగతంగా అల్లకల్లోలం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ పథకం చైనా క్వాసీ-కాన్‌స్క్రిప్ట్‌ ఫోర్స్‌తో పోలి ఉన్నదని గుర్తు చేసిన భక్షి.. సైన్యం సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు తప్ప అగ్నివీరులతో ఎక్కువగా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. అసలు ఈ పథకాన్ని అమలు చేసే ముందు పైలట్‌ ప్రాజెక్టుగా చేపడితే బాగుండేదని, డైరెక్ట్‌గా అమలు చేయటం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఆర్మీలో యువతతో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఉండాలి. అలాగైతేనే యుద్ధంలో గెలుపు సాధ్యమవుతుంది. ప్రస్తుతం సాయుధ దళాలు గొప్ప పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ వ్యవస్థను భగ్నం చేయొద్దు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్నే చూసుకొంటే.. రష్యాకు ఎంతో ఆయుధ సంపత్తి ఉన్నా, చాలా చిన్న దేశం ఉక్రెయిన్‌తో పోరాడుతూనే ఉన్నది. కారణం.. రష్యా వద్ద కావాల్సినంత మానవ వనరులు లేకపోవటమే' అని భక్షి వివరించారు. రష్యా లాంటి పరిస్థితి మనకు రావొద్దని, రష్యా నుంచి గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. 'అగ్నిపథ్‌లో చేరి నాలుగేండ్ల శిక్షణ తీసుకొంటారు. ఆ తర్వాత ఎంపికైతే ఫర్వాలేదు. ఎంపిక కాకపోతే వాళ్ల పరిస్థితి ఏమిటి? అప్పటికే 30 ఏండ్లు వచ్చేస్తాయి. ఆ వయసులో ఆర్మీ సంబంధిత రంగంలో ఉద్యోగాలు దక్కవు. వాళ్లంతా నిరుద్యోగులుగానే మిగిలిపోవాలా? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి భరోసా కల్పించకపోతే ఎలా?' అని భక్షి ప్రశ్నించారు. వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకొనేందుకు శక్తిమంతమైన సాయుధ దళ వ్యవస్థను నాశనం చేయవద్దని అన్నారు. రక్షణ బడ్జెట్‌ను జీడీపీలో 3 శాతానికి పెంచాలని, ఆర్మీ స్థాయిని దిగజార్చవద్దని హితవు పలికారు. యువత కెరీర్‌గా ఎంచుకొనే రంగాల్లో ఆర్మీ ఉన్నత స్థాయిలో ఉన్నదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)