దేశంలో మత హింస పెరిగిపోయింది

Telugu Lo Computer
0


మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో మత హింస పెరిగిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ కూడా విధించారు. దీనిపై అశోక్ గహ్లోత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దేశంలో హింసాత్మక ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఝార్ఖండ్‌లో 2019లో జరిగిన మూక హత్యపై అప్పట్లో ప్రధాని మోదీ స్పందించారని అశోక్ గహ్లోత్ గుర్తు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యల ప్రభావంతో హింస కాస్త చల్లారినట్లు కనపడిందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతోన్న మతపర అల్లర్ల గురించి దేశంలోని ప్రతి ముఖ్యమంత్రితో ప్రధాని మోదీ వెంటనే మాట్లాడాలని ఆయన అన్నారు. ప్రజలు అందరూ శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. సమస్యకు హింస పరిష్కారం చూపబోదని ఆయన చెప్పారు. కాగా, నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల అనంతరం ఆమెకు మద్దతు తెలుపుతూ కన్హయ్య లాల్ పోస్ట్ చేయడంతోనే ఆయనను హత్య చేశారని విచారణలో తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)