అమెరికా తనను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నింది !

Telugu Lo Computer
0


అమెరికా తనను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడడం వల్లే తాను అధికారం కోల్పోయానని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. తాను రష్యా, చైనా, అఫ్గానిస్థాన్ విషయంలో స్వతంత్రంగా పాక్‌ విదేశీ విధానాన్ని రూపొందించడం వల్లే అమెరికా ఆ పని చేసిందని అంటున్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ఆర్మీపై పలు ఆరోపణలు చేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో పాక్ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ''మా ప్రభుత్వం చాలా బలహీన సర్కారు. ఎన్నికల్లో గెలిచిన సమయంలో పలు పార్టీల సాయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రతిచోట నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. అసలు నేను ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం నా చేతిలో లేదు. అది ఎవరి చేతుల్లో ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ''మా చేతులను కట్టేసినట్లుగా పరిస్థితి ఉండేది. మేము ఎవరిపై ఆధారపడి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి వచ్చిందో అందరికీ తెలుసు'' అని ఇమ్రాన్ అన్నారు. శత్రువుల వల్ల ముప్పు పొంచి ఉండడంతో తమ దేశానికి బలమైన ఆర్మీ అవసరం ఉందని చెప్పారు. అయితే, బలమైన ప్రభుత్వమూ ఉండాల్సిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు. తన హయాంలో అది మాత్రం సాధ్యపడలేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. 'మేము అన్ని వేళలా వారి (ఆర్మీ)పైనే ఆధారపడ్డాము. వాళ్లు చాలా మంచి పనులు కూడా చేశారు. అయితే, వారు చేయాల్సిన అనేక పనులూ చేయలేదు. జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్ఏబీ) వంటి వ్యవస్థలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అధికారం మొత్తం వారి చేతుల్లోనే ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం, ఆర్మీ వల్ల పాకిస్థాన్ ఒకవేళ విదేశీ అప్పులు ఎగ్గొట్టే స్థితికి వస్తే దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒకవేళ ఈ పరిస్థితే తలెత్తితే అత్యధికంగా నష్టం చేకూరేది ఆర్మీకే. ఇదే కనుక జరిగితే అణు నిరాయుధీకరణపై మనపై ఒత్తిడి పడుతుంది'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2018లో అధికారంలోకి వచ్చిన సమయంలో పాక్ ఆర్మీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన పాక్ ఆర్మీ మద్దతు వల్లే గెలిచారని ప్రచారం జరిగింది. ఆయన వెనక ఉండి ఆర్మీయే ప్రభుత్వాన్ని నడిపిస్తోందని వార్తలు వచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)