నుపుర్, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యల దుమారం

Telugu Lo Computer
0


మొహమ్మద్ ప్రవక్తపై బీజేపీ లీడర్లు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల సంఖ్య పెరిగింది. ఖతర్, కువైట్, బహ్రైన్, ఇరాన్ దేశాల జాబితాలో తాజాగా  సౌదీఅరేబియా కూడా చేరింది. బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తున్నట్టు సౌదీ విదేశాంగ శాఖ శాఖ అధికారికంగా ఆక్షేపించింది. విశ్వాసాలు, మతాలకు గౌరవమివ్వాలని ఈ సందర్భంగా సౌదీ పిలుపునిచ్చింది. నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ తీసుకున్న చర్యలను సౌదీ స్వాగతించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ పర్యటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. నుపుర్ వ్యాఖ్యలను ఇప్పటికే ఖతర్, కువైట్, ఇరాన్ తీవ్రంగా ఖండించాయి. ఆయా దేశాల్లోని దౌత్య ప్రతినిధులకు సమన్లు జారీ చేశాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయ వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న వేళ ఆయా దేశాల ప్రభుత్వాలు స్పందించాయి. ఖతర్ ప్రభుత్వం దోహాలోని భారతీయ దౌత్య ప్రతినిధికి నిరసన లేఖను పంపింది. భారత ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించాలని లేఖలో పేర్కొంది. కువైట్ కూడా భారత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు సౌదీ నగరం జెడ్డా కేంద్రంగా పనిచేస్తున్న ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్) కూడా వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబట్టింది. కాగా ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధంలేదని భారతీయ దౌత్య ప్రతినిధులు సమాధానమిచ్చారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో పరిగణించాలని వివరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)