సెంచరీ చేసి ఆదుకున్నబెయిర్‌స్టో !

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌పై ఇంగ్లాండ్ పట్టు బిగించింది. 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశ నుంచి అదే ఆరు వికెట్లకు ఏకంగా 264 పరుగులు చేసిన దశకు చేరుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్‌కు ఆపద్భాంధవుడిలా మారాడు. 130 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెయిలెండర్ బ్యాటర్ జెమీ ఓవర్టన్ సైతం సెంచరీ దిశగా సాగుతున్నాడు. 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ 200 పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో రోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్ టాప్ ఆర్డర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. అలెక్స్ లీ-4, జాక్ క్రావ్‌లీ-6, ఒల్లె పోప్-5, జో రూట్-5, బెన్ స్టోక్స్-18, బెన్ ఫోక్స్-0 పరుగులకు అవుట్ అయ్యారు. కనీసం వంద పరుగులైనా చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ దశలో బెయిర్‌స్టో క్రీజ్‌లో కుదురుకున్నాడు. సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో 21 ఫోర్లు కొట్టాడు. అతని బ్యాటింగ్ దాదాపుగా వన్డే ఇంటర్నేషనల్స్‌ను తలపించేలా సాగింది. అటు టెయిలెండర్ జెమీ ఓవర్టన్ కూడా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. 106 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అతని ఇన్నింగ్‌లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ ఇన్నింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లను నేలకూల్చాడు. నీల్ వాగ్నర్-2, టిమ్ సౌథీ ఒక్క వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ కంటే 65 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు వికెట్ పడకుండా జానీ బెయిర్‌స్టో, జెమీ ఓవర్టన్ జాగ్రత్తగా ఆడితే- ఆధిక్యత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంగ్లాండ్ తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యతలో ఉంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారీ ఆధిక్యతను సాధించే అవకాశాన్ని న్యూజిలాండ్ కోల్పోయింది. బెయిర్‌స్టో, ఓవర్టన్ ద్వయం దెబ్బకు పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టయింది బ్లాక్ క్యాప్స్‌కు. ఫలితంగా- ఈ టెస్ట్.. ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)