టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్​లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ?

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే తాటి ప్రధాన అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి, రేవంత్ రెడ్డిలతో భేటీ అయిన తాటి వెంకటేశ్వర్లు, సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ మార్పుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న తాటి, పార్టీని వీడటం టీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. కొద్ది వారాల క్రితం చెన్నూరు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు చెన్నూరు టికెట్ ఖాయమైందనే చర్చ సాగుతోంది. ఇక ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నట్టు ప్రకటించారు. విజయారెడ్డి టీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ దానం నాగేందర్ కారణంగా ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కాంగ్రెస్ తరపున ఆమెకు ఖైరతాబాద్ తరపున పోటీ చేసే అవకాశం లభించిందని.. ఈ టికెట్‌పై రేవంత్ రెడ్డి ఆమెకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే విజయారెడ్డి టీఆర్ఎస్‌కు టాటా చెప్పి కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వచ్చాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విజయారెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈసారి మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెనే మేయర్ అవుతారని విస్తృతంగా ప్రచారం జరిగినా, చివరికి ఆమెకు నిరాశే మిగిలింది. పదవి దక్కలేదని అలకవహించిన ఆమెను ఎలాగోలా బుజ్జగించి మేయర్ ఎన్నికల్లో భాగస్వామిని చేశారు టీఆర్ఎస్ నేతలు. సొంత పార్టీ తీరుతో అసంతృప్తిగా ఉన్న విజయారెడ్డి.. ఏక్షణమైనా అసెంబ్లీ ఎన్నికలు రావచ్చనే అంచనాతో కాంగ్రెస్ లో చేరిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ తర్వాత గొప్ప నేతగా ఇమేజ్ కలిగిన దివంగత పీజేఆర్ కూతురు తిరిగి కాంగ్రెస్ లో చేరడం సిటీలో బూస్ట్ అవుతుందని పార్టీ భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)