ట్రాఫిక్‌ పోలీసులకు క్షమాపణ చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవింద్‌ లింబావళి ట్రాఫిక్‌ పోలీసులు, మీడియా సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపినందుకుగాను బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెను ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై ఒంటికాలుతో లేచింది. నోటికి పనిచెప్పి తిట్ల దండకం అందుకున్నది. ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించిన మీడియా సిబ్బంది పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద్‌ తన కూతురు ప్రవర్తనపట్ల పోలీసులు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. బెంగళూరులో గురువారం తన బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. దీంతో పోలీసులు ఆమె కారును నిలిపారు. సిగ్నల్‌ క్రాస్‌ చేసినందుకు రూ.10 వేలు జరిమానా విధించారు. చిర్రెత్తుకొచ్చిన ఆమె తన కారునే ఆపుతారా.. తాను ఎమ్మెల్యే లింబావళి కూతురుని అని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఇప్పుడు ఫైన్‌ చెల్లించనని మొండికేసింది. వెంటనే తన కారును విడిచిపెట్టాలని వారితో గొడవ పెట్టుకున్నది. ఈ వ్యవహారాన్నంతా రికార్డు చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ నేపథ్యంలో కూతురి ప్రవర్తనపట్ల ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)