కువైట్‌ స్టోర్ల నుంచి భారత ఉత్పత్తుల తొలగింపు

Telugu Lo Computer
0


మహమ్మద్‌ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీల ఉత్పత్తులను ఇస్లాం దేశాల్లోని వ్యాపారులు బహిష్కరిస్తున్నారు. కువైట్‌లోని ఆల్‌-ఆర్దియా కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సూపర్‌మార్కెట్లు, స్టోర్ల నుంచి భారత్‌లో తయారైన మసాలా ఉత్పత్తులు, బియ్యాన్ని తొలగించినట్టు నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని అరబ్‌ దేశాల్లోని సూపర్‌ మార్కెట్ల షెల్ఫ్‌ల్లో ఉన్న భారత ఉత్పత్తుల మీద ప్లాస్టిక్‌ కవర్లను కప్పి 'భారత ఉత్పత్తులను మేము తొలగిస్తున్నాం' అనే బోర్డులు వేలాడదీయం కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నది. భారత్‌కు చెందిన వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని ముస్లిం దేశాల్లో సోషల్‌మీడియాలో ఉద్యమం ఊపందుకున్నది. నూపుర్‌ శర్మ, జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలను ఇండోనేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, యూఏఈ, జోర్డాన్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు సోమవారం ఖండించాయి. ఈ మేరకు అక్కడి దౌత్యవేత్తలకు సమన్లు పంపించాయి. జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉన్నది. ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ ఇప్పటికే భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. నూపుర్‌ శర్మను, జిందాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌, ఎంఐఎం డిమాండ్‌ చేశాయి. విదేశాల ఒత్తిడితోనే నూపుర్‌, జిందాల్‌ను బీజేపీ బహిష్కరించిందని, లేకపోతే వారిని అలాగే పార్టీలో కొనసాగించేవారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం, వామపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ నిర్వాకం వల్ల చిన్న దేశాలు కూడా భారత్‌ను ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఎద్దేవా చేశారు. నూపుర్‌ సస్పెన్షన్‌ ఒక డ్రామా అని ఎస్పీ, బీఎస్పీ అభివర్ణించాయి. కఠిన చర్యలకు డిమాండ్‌ చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)