రాజ్ భవన్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

Telugu Lo Computer
0


ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆందోళనలతో మార్మోగుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని వరుసగా మూడవరోజు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాహుల్ ను 10 గంటలు విచారించిన పోలీసులు.. రెండవ రోజు కూడా దాదాపు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మూడవ రోజు కూడా రాహుల్ ను పిలవడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయాని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఆంక్షలు కూడా విధించారు. మూడవ రోజు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి వెళుతున్న సమయంలో పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ నేతలను అదుపులోనికి తీసుకునేందుకు పోలీసులు బలవంతంగా ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. తమకు అడ్డొచ్చిన కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళనకు దిగిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ వర్కర్లను లాక్కుంటూ తీసుకెళ్లి బస్సులు ఎక్కించారుఅయితే పోలీసులు దౌర్జన్యం చేశారని, ఏఐసీసీ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌లను ముట్టడికి కాంగ్రెస్ పిలుపిచ్చింది. ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు చొరబడటంపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా స్పందించారు. మోడీ ప్రభుత్వం నియంతలను మించిపోయిందని మండిపడ్డారు. పోలీసులు ఏఐసీసీ ఆఫీసులోకి బలవంతంగా చొరబడ్డారంటూ ఓ వీడియోను సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ''ఓ నియంతా...ప్రజాస్వామ్య పీఠం నుంచి దిగిపో. ప్రజల ముందుకు రా'' అని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చారని వేణుగోపాల్ తీవ్రంగా ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)