డెల్టా రైతులకు కొత్త కష్టాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 9 June 2022

డెల్టా రైతులకు కొత్త కష్టాలు !


డెల్టాకు సాగునీరు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న వేళ రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. డెల్టా ప్రాంతంలోని లక్షలాది ఎకరాల పరిధిలో పంటలు వేయాల్సి ఉండగా పంటలకు సాగునీరు అందించే పంట కాలువలు మాత్రం పూడికతో నిండి పోయి ఉన్నాయి. ఇరిగేషన్ రెవెన్యూ శాఖల సమన్వయంతో పంటలకు నీరు అందించాల్సిన అధికారులు కనీసం పంట కాలువల దుస్థితిపై దృష్టి పెట్టకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అధికారుల తీరుపై  రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా ఆయకట్టు పరిధిలోని లక్షలాది ఎకరాల పంట సాగు మరికొద్దిరోజుల్లో ప్రారంభం అవుతున్న వేళ రైతుల కష్టాలు అధికారులకు పట్టడం లేదా అన్న ఆలోచన కలిగిస్తుంది. ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని కానీ అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇరిగేషన్, వ్యవసాయ శాఖ రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో పెడచెవిన పెట్టాయని రైతులు అంటున్నారు. రైతుల బాధలు ఇరిగేషన్ శాఖ గాలికి వదిలేసినట్లూ కనిపిస్తుంది. జూన్ 10 నుండి రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పరిధిలోని వందలాది పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ దిగువన మంగళగిరి, దుగ్గిరాల ,తెనాలి, వంటి ప్రాంతాల్లో ప్రధాన డెల్టా ప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్ పూర్తి స్థాయిలో నీటి పారుదలకు సిద్ధంగా లేదని డెల్టా పరిధిలో అనేక గ్రామాల్లో సైతం పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయనీ రైతులు చెబుతున్నారు. జూన్ 10 నుండి సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా గత మూడు సంవత్సరాలుగా కృష్ణా డెల్టా ప్రాంతంలో పంట కాలువలో పూడిక తీయడం లేదని రైతులు చెబుతున్నారు. 2019లో పూడిక తీసిన వ్యవసాయశాఖ ఇరిగేషన్ అధికారులు ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు కరోనా అంశంతో చేతులెత్తేశారు. దీంతో బకింగ్ హామ్ కెనాల్ తో పాటు అనేక పంట కాల్వలలో భారీగా పూడిక పేరుకుపోయింది.ప్రధానంగా తూటికాడతో పాటు మున్సిపాలిటీ నుండి విడుదల అవుతున్న వ్యర్థాలు సైతం పంటకాలంలో కలపడంతో దుర్గంధం వెదజల్లుతూ పంట కాలువలు పూడికతో నిండి పోయి ఉన్నాయనీ రైతులు అంటున్నారు. కనీసం ఈ ఖరీఫ్ సీజన్లో అయినా పూడిక తీసి సాగునీరు విడుదల చేసేందుకు సిద్ధం కావాల్సిన ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కనీసం పూడిక తీత పై ప్రభుత్వనికి ప్రతిపాదనలు కూడా పంపలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమయం సందర్భం లేకుండా, రైతులకు ఉపయోగపడకుండా సాగునీరు విడుదల చేసి ఏంటి ప్రయోజనం అంటూ నిలదీస్తున్నారు. గతంలో నీటి సంఘాలు ఉన్నప్పుడు రైతుల ద్వారా నీటి సంఘాల అధ్యక్షులు ఎన్నికైనప్పుడు పంట కాలువలపై వారికి అవగాహన ఉండేది. నీటి సంఘాలు ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పంట పొలాల మీద ,కాలువల మీద తిరిగే వారిని ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం పోయిందని రైతులు అంటున్నారు. నీటి తీరువా ద్వారా రైతన్నల నుంచి రెవిన్యూ శాఖ వసూలు చేస్తున్న సొమ్మును ఇరిగేషన్ శాఖకు ఇస్తే పంట కాలువల మెయింటినెన్స్ జరిగేదని, కానీ ఇరిగేషన్ కు రెవిన్యూ శాఖకు అగ్రికల్చరల్ శాఖకు సమన్వయమే లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. రైతులకు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సమన్వయం లేదని ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం పంట కాల్వల పరిస్థితిపై పర్యటించిన సందర్భం లేదని రైతులు అంటున్నారు. మున్సిపాలిటీ నుండి వ్యర్థపదార్థాలను పంటకాల్వలో కలపడం వల్ల పంట పొలాలకు నీళ్లు పెట్టాలంటే రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. పెద్ద ఎత్తున పంటకాలంలో చేరుతున్న ఫ్యాక్టరీల వ్యర్థాలు రైతులకు చర్మ రోగాలు తెప్పిస్తున్నాయి. నీటి కాలుష్యంతో పంట దిగుబడి తగ్గిపోతుంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో డెల్టా ప్రాంతంలో యుద్ధప్రతిపదికన పూడిక తీయాలని ఆ తర్వాతే నీటిని విడుదల చేయాలంటున్నారు. లేదంటే.. డెల్టా ప్రాంతంలోని అనేక పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. పూడిక తీయకుండా నీటిని విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజ్ దిగువన మొదటి భూములకు ముంపు ప్రమాదం ఉంటుందని డెల్టా ప్రాంతంలో చివరి భూములకు నీరు అందని పరిస్థితులు వస్తాయని రైతులు అంటున్నారు.

No comments:

Post a Comment