విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు

Telugu Lo Computer
0


కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్ల దాడి కూడా చేశారు. ఇప్పటికే ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులను A-225గా సత్యరుషి, A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ నలుగురు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అటు ఈ అల్లర్లకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఇప్పటివరకు 258 మంది నిందితులను గుర్తించగా.. వారిలో 142 మందిని అరెస్టు చేశామని, మరో 116 మంది కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. నిందితులందరి పేర్లపై రౌడీషీట్లు తెరుస్తామని పేర్కొన్నారు. నిందితులంతా అమలాపురంలో జరిగిన నష్టానికి రెండింతలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)