ఎలక్ట్రిక్‌ కారులో మంటలు.

Telugu Lo Computer
0


ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కార్లలో ఒకటి టాటా నెక్సాన్‌ ఈవీ కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కంపెనీ ప్రకటన విడుదల చేసింది. 'ముంబై వెస్ట్‌ వసాయ్‌ ప్రాంతంలోని రెస్టారెంట్‌ ప్రాంతంలో తెలుపు రంగు టాటా నెక్సాన్‌ ఈవీ కారు మంటలు చెలరేగాయి. అయితే, ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో బుధవారం కంపెనీ ప్రకటన విడుదల చేసింది. కారులో మంటలు చెలరేగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. సమగ్ర విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని చెప్పింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ తన అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రమాదాలు అసాధారణం కాదని, ప్రపంచవ్యాప్తంగా అలాంటి నివేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. పూణేలో ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో భద్రతా సమస్యలపై చర్చ ప్రారంభమైంది. ఒకినావా ఆటోటెక్, ప్యూర్ ఈవీ తదితర ప్రముఖ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల్లోనూ మంటలు చెలరేగిన సంఘటనలున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సమస్యలపై విమర్శల నేపథ్యంలో పలు కంపెనీలు వాహనాలను రీకాల్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగడానికి కారణాలను పరిశోధించేందుకు కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో నిపుణుల కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)