కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనల అమలుతో ఏసీ ధరలకు రెక్కలు ?

Telugu Lo Computer
0


కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు అమల్లోకి వస్తున్నకారణంగా ప్రస్తుతమున్న ఏసీల రేటింగ్‌ ఒక మెట్టు కిందకు దిగుతుంది. అంటే 5 స్టార్‌ నుంచి 4 స్టార్‌కు, 4 స్టార్‌ నుంచి 3 స్టార్‌కు రేటింగ్‌ తగ్గుతుందన్నమాట. ఇక 5 స్టార్‌ రేటింగ్‌ లభించాలంటే, మరింత ఇంధన సామర్థ్య ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దీనివల్ల ఏసీ తయారీ కంపెనీలకు తయారీ వ్యయం మరింత పెరగనుంది. ఆ భారాన్ని తిరిగి వినియోగదారులకే బదిలీ చేస్తుండటంతో వచ్చే నెల నుంచి ఏసీల ధరలు 7-10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఉన్న ఏసీ నిల్వలను వదిలించుకోవడానికి మరో ఆరు నెలల సమయం ఇవ్వాల్సిందిగా కంపెనీలు కోరాయి. దీంతో గడువును జులైకి ప్రభుత్వం పొడిగించింది. ఏసీలకు విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే వీటి ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయని ఏసీల పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఇంధన రేటింగ్‌ నిబంధనలతో ఏసీల ఇంధన సామర్థ్యం 20 శాతం మేర పెరుగుతుందని అంటున్నాయి. అదే సమయంలో ఈ నిబంధనలకు అనుగుణంగా ఏసీలను తయారు చేసేందుకు ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.2000- 2,500 ఖర్చు ఎక్కువగా అవుతుందని చెబుతున్నాయి. అయితే ధర పెరిగినప్పటికీ అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో కూడిన ఏసీ వినియోగదారుడికి లభిస్తుందని పంజ్‌లాయిడ్‌ విక్రయాల విభాగ అధిపతి రాజేశ్‌ రాఠి అంటున్నారు. ఈ కొత్త నిబంధనలతో భారత ఇంధన నిబంధనలు ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలుస్తాయని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)