భయపెట్టడానికి ప్రయత్నించొద్దు !

Telugu Lo Computer
0


కేరళలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు వ్యవహారం మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కీలక నిందితురాలు స్వప్నా సురేశ్‌ ఇటీవల సీఎం పినరయి విజయన్‌, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలతో అక్కడ రాజకీయ దుమారం కొనసాగుతోంది. సీఎం విజయన్‌ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై చేస్తోన్న ఆరోపణలపై విజయన్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. కేరళ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సులో మాట్లాడుతూ.. ఇలాంటి ఆరోపణలు తనను గానీ.. తమ ప్రభుత్వాన్ని గానీ ఏ విధంగానూ ప్రభావితం చేయలేవన్నారు. తమకు ప్రజల మద్దతు, విశ్వాసం ఉందని చెప్పారు. ఎన్నికల ముందు కూడా వరదలు సహా ఇలాంటి అనేక ఆరోపణలు చేసినా ప్రజలు వాటన్నింటినీ తిరస్కరించి 99సీట్లలో గెలిపించి రెండోసారి తమకు అపూర్వ విజయం అందించారన్నారు. తాము ప్రజలకు మరింత రుణపడి ఉన్నామని తెలిపారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ శక్తుల ముందూ తాము తలవంచబోమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రజలకు మరింత రుణపడి ఉన్నామనీ.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడే ఏ శక్తుల ముందూ తలవంచబోమన్నారు. దేశంలో సెక్యులర్‌ స్ఫూర్తిని పరిరక్షించాలని, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా దృఢ వైఖరితో ఉండాలంటూ కొనసాగించిన తన ప్రసంగంలో తాజా ఘటనల నేపథ్యంలో విపక్షాల ఆరోపణలకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసి భయపెట్టేందుకు ప్రయత్నించొద్దని.. ఇలాంటి జిమ్మిక్కులు, ప్రయత్నాలేవీ ఫలించబోవన్నారు. తమ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన.. కొందరు స్వార్థంతో చేసే ఆరోపణల్లో వాస్తవాలను గుర్తించగలరని చెప్పారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నిందితుల వాంగ్మూలాలకు సంబంధించిన వార్తలకు మీడియా అధిక ప్రాధాన్యమివ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇలాంటి వార్తల ద్వారా ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను మంటకలపొచ్చని మీడియా భావిస్తోందా? అని ప్రశ్నించారు. అలాంటి రిపోర్టులు మీ విశ్వసనీయతకు సరిపోతాయో, లేదో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. మీడియాను సరిదిద్దేందుకు ఎవరూ రారని.. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)