వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరాల్సిందే !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గతం కంటే భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు అన్ని స్ధానాల్ని కైవసం చేసుకునేందుకు ప్లాన్స్ వేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? అనే అంశాలను జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.వాటి ఆధారంగా తదుపరి వ్యూహం ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో పర్యటించిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో జగన్ ఇవాళ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. క్లీన్ స్వీప్ చేయాలని నేతలకు సూచిస్తున్నారు. పార్టీ యంత్రాంగం ఇచ్చే రిపోర్టుతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికను..అలాగే పీకే నివేదికలను జగన్ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పీకే నివేదికపైనే జగన్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి భారీ మెజారిటీతో అదికారంలోకి రావాలని సీఎం జగన్ ఇవాళ నిర్వహించిన వైసీపీ వర్క్ షాప్ లో పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గతంలో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. 2024 ఎన్నికల్లో 175 సీట్లు గెల్చుకోవాలని నేతలకు టార్గెట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం మన లక్ష్యమని..కష్టపడితే ఇది కష్టమేమీ కాదని జగన్ నేతలకు తెలిపారు. ఇందుకు అనుగుణంగా నేతలు పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. అప్పుడే టార్గెట్ అందుకోగలం అంటూ నేతల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..ప్రస్తుతం వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం నిరంతర కార్యక్రమమని..దాదాపు 8 నెలల పాటు ఇది కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గాల్లో ఒక్కో సచివాలయం పరిధిలో రెండేసి రోజుల చొప్పున 10 సచివాలయాల పరిధిలో దీన్ని నిర్వహించాలన్నారు. ఇకపై నెలకో వర్క్ షాప్ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం నుంచి వచ్చే స్పందనపై వర్క్ షాప్ లో చర్చించనున్నారు. ఇందులో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని జగన్ నేతలకు స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)