రైతులు, జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ఆర్దికసాయం

Telugu Lo Computer
0


రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలతో పాటు గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌లతో కలిసి కేసీఆర్ చెక్కులను పంపిణీ చేశారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన 600 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందజేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా ఛండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దానికి సంబంధించిన చెక్కులను మృతుల కుటుంబాలకు అందజేశారు. దేశ చరిత్రలో పంజాబ్ రైతులు గొప్ప పోరాటాలు చేశారన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి చెందిన భగత్‌సింగ్ లాంటి ఎందరో వీరులు ప్రాణాలర్పించి స్వాతంత్ర్యం సాధించారని చెప్పారు. పంజాబ్ యువకులు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. హరిత విప్లవంతో పంజాబ్ రైతులు దేశం ఆకలిని తీర్చారని, సాగు చట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన దేశం పరిస్థితి మారలేదని, రైతుల సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోందన్నారు. సాగుకు ఉచితంగా విద్యుత్ అందిస్తుంటే మీటర్లు పెట్టాలంటోందని విమర్శించారు. బీజేపీని ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)