మమల్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి!

Telugu Lo Computer
0


జమ్ముకాశ్మీర్‌లోని కశ్మీరీ పండిట్‌ ప్రభుత్వ ఉద్యోగులు అభ్రదతా భావంలో ఉన్నారు. ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 12న బుద్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో కశ్మీర్‌ తమకు క్షేమమైన ప్రాంతం కాదని కశ్మీరీ పండిట్‌ ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో సామూహికంగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఈ మేరకు శనివారం అత్యవసర సందేశంతో కూడిన లేఖ రాశారు. ప్రధానమంత్రి ప్యాకేజీ, నాన్ పీఎం ప్యాకేజీ కశ్మీరీ పండిట్‌ ప్రభుత్వ ఉద్యోగులు లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు. 'దయచేసి మమ్మల్ని కశ్మీర్‌ ప్రావిన్స్ నుంచి సురక్షితంగా తరలించండి' అని వేడుకున్నారు. 'మీ దయతో మమ్మల్ని రక్షించమని అభ్యర్థిస్తున్నాం. సార్, మీరు ఏమీ చేయలేకపోతే, మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాకు కశ్మీర్‌ ఏ మాత్రం సురక్షితం కాదు' అని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో 350 మందికిపైగా కశ్మీరీ పండిట్‌ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు తమ రాజీనామా లేఖలను పంపారు. కాగా రాహుల్‌ భట్‌ మరణంపై కశ్మీర్‌ లోయలో కశ్మీరీ పండిట్ల నిరసనలు మిన్నంటాయి. శనివారం కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)