స్వదేశీ యుద్ధ నౌకలను ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

Telugu Lo Computer
0


దేశంలో తయారైన రెండు యుద్ధ నౌకలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలోని మజగావ్ డాక్‌యార్డులో మంగళవారం ప్రారంభించారు. రెండు స్వదేశీ తయారీ యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారి అని మజగావ్ డాక్ షిప్‌ బిల్డర్స్ లిమిటెడ్ తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ 'సూరత్', 'ఉదయగిరి' అనే స్వదేశీ నిర్మిత యుద్ధ నౌకలను ప్రారంభించారు. 'సూరత్' యుద్ధ నౌక P15B classకు చెందినది. ఇది నాలుగో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. 'ఉదయగిరి' P17A classకు చెందిన రెండో స్టెల్త్ ఫ్రిగేట్. ఈ రెండిటి డిజైన్లను డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ రూపొందించింది. వీటిని ముంబైలోని మజగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని, అటువంటి సమయంలో భారత దేశం స్వయం సమృద్ధతపై దృష్టి సారించిందని తెలిపారు. దేశ సముద్ర సంబంధిత యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సడలని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమే ఈ యుద్ధ నౌకలని చెప్పారు. కోవిడ్ మహమ్మారి వేధిస్తున్నప్పటికీ నౌకల తయారీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు మజగావ్ డాక్స్ లిమిటెడ్‌ను అభినందించారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత నావికా దళానికిగల వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కోసం కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని పర్వత శ్రేణుల పేరును 'ఉదయగిరి' యుద్ధ నౌకకు పెట్టారు. ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్స్‌లో ఇది మూడో నౌక. శివాలిక్ క్లాస్‌కు చెందిన P17 ఫ్రిగేట్స్‌ను మరింత అభివృద్ధి చేసి ఈ నౌకను నిర్మించారని భారత నావికా దళం  తెలిపింది. స్టెల్త్ ఫీచర్స్‌ను మెరుగుపరిచి, అత్యాధునిక ఆయుధాలు, సెన్సర్లు, ప్లాట్‌ఫాం మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అమర్చినట్లు వివరించింది. గతంలోని లియాండర్ క్లాస్ ఏఎస్‌డబ్ల్యూ ఫ్రిగేట్‌కు చెందిన 'ఉదయగిరి' సరికొత్త అవతారమే ప్రస్తుత 'ఉదయగిరి' యుద్ధ నౌక అని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)