నకిలీ నోట్ల పెరుగుదలపై ఆర్బీఐ ఆందోళన

Telugu Lo Computer
0


దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువైన కరెన్సీల నకిలీ నోట్లు బాగా పెరిగాయని తెలిపింది. రూ.500ల నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000ల నకిలీ నోట్లు 54.16 శాతం మేర పెరిగాయని పేర్కొంది. ఈ మేరకు తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నల్ల ధనంతోపాటు నకిలీ నోట్లను అరికట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లైన పాత రూ.1,000, పాత రూ.500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో ఆధునిక ఫీచర్లు, సేఫ్టీతో కూడిన రూ.2,000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 విలువైన కొత్త నోట్లను విభిన్న రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే రూ.2,000 నోట్లు మార్కెట్‌ నుంచి మాయమవుతుండటంతో వీటిని పెద్ద ఎత్తున నల్ల ధనం రూపంలో దాస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.2,000 నోట్ల ముద్రణను చాలా వరకు తగ్గించారు. మరోవైపు కొత్త కరెన్సీల నకిలీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఈ నకిలీ నోట్ల చెలామణి బాగా పెరిగిందన్న సంగతిని స్వయంగా ఆర్బీఐనే వెల్లడించింది. దీంతో విపక్షాల చేతికి మరో ఆయుధం చిక్కినట్లయ్యింది. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు మండిపడ్డాయి. 'పెద్ద నోట్ల రద్దు దురదృష్టకరమైన విజయం. భారత ఆర్థిక వ్యవస్థను హింసించడమే' అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో విమర్శించారు. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ కూడా ట్విట్టర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 'మిస్టర్ పీఎం మోడీకి నమస్కారం. డీమానిటైజేషన్ గుర్తుందా? మీ నిర్ణయంపై మమతా బెనర్జీ మిమ్మల్ని ఎలా నిలదీశారు? దేశంలో ఒక డెమో అని, అన్ని నకిలీ కరెన్సీని తొలగిస్తుందని మీరు ఎలా హామీ ఇచ్చారు? నకిలీ నోట్లలో భారీ పెరుగుదలను సూచిస్తున్న తాజా ఆర్బీఐ నివేదిక ఇక్కడ ఉంది.' అంటూ ఎద్దేవా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)