ఇది రాజకీయ హత్యే

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్లో బీజేవైఎం నేత అనుమానాస్పదంగా మృతి చెందాడు. బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌరాసియా మృతికి తృణమూల్ కారణమంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇది తృణమూల్ చేసిన హత్యేనంటూ ఆరోపణలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మృతి చెందడంతో రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. బెంగాల్ పర్యటనలో ఉన్న అమిత్ షా మృతుడు అర్జున్ చౌరాసియా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనంటూ అమిత్ షా మండిపడ్డారు. తృణమూల్ రాష్ట్రంలో తిరిగి అధికారం దక్కించుకుని ఏడాది అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ హత్యలు మొదలయ్యాయి. బీజేవైఎం నేత అర్జున్ మర్డర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. వాళ్ల నానమ్మను కూడా విచక్షణ లేకుండా కొట్టారు. పార్టీ కార్యకర్త అర్జున్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని అమిత్‌షా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా కోల్‌కతాలో భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ బైకు ర్యాలీని లీడ్ చేయాల్సిన బీజేపీ కార్యకర్త అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మృతిచెందాడు. కోల్‌కతాలోని చిత్పూర్-కాసిపోర్ ప్రాంతంలో 26 ఏళ్ల అర్జున్ చౌరాసియా పాడుబడిన బిల్డింగ్‌లో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. తమ కార్యకర్తను అధికార తృణమూల్ హత్య చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. మృతుడు అర్జున్ కాళ్లు నేలకు తగులుతూ ఉండటం చూస్తుంటే ఇది కచ్చితంగా రాజకీయ హత్యేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది. వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)