చైనాలో పిల్లలకు కరోనా !

Telugu Lo Computer
0


చైనాలో కరోనా సోకిన పిల్లల్ని తల్లిదండ్రులకు దూరంగా ఉంచాలనే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ సోకిన పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయొద్దని సూచిస్తూ, 30 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు చైనా ప్రభుత్వానికి లేఖలు రాశారు. చైనాలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా పిల్లలకు కరోనా సోకితే, వాళ్లని ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో చిన్నారులు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా షాంఘై నగరంలో ఈ రూల్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, ఇలా ఐసోలేషన్‌లో ఉంటున్న పిల్లల్లో అమెరికా, బ్రిటన్‌తోపాటు అనేక దేశాలకు చెందిన చిన్నారులు ఉన్నారు. తమ దేశానికి చెందిన చిన్నారులు కూడా ఐసోలేషన్‌లో, తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో ఆయా దేశాలకు చెందిన దౌత్యవేత్తలు స్పందించారు. చైనా విదేశాంగ శాఖకు లేఖలు రాశారు. కరోనా సోకిన చిన్నారుల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయొద్దని లేఖలో కోరారు. అయితే, ఈ లేఖలపై చైనా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, పిల్లల్తో పాటు తల్లిదండ్రులకు కూడా కరోనా సోకినప్పుడే వాళ్లను కలిపి ఉంచుతామని, లేకపోతే పిల్లల్ని వేరుగానే ఉంచుతామని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల కరోనా అదుపులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)