ఎండీయూ ఆపరేటర్లు తీవ్ర అసంతృప్తి

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాలకు ఇన్స్యూరెన్స్‌ చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఆరేళ్ల పాటు బీమా సొమ్మును పౌరసరఫరా సంస్థ చెల్లిస్తుందని గత ఏడాది విడుదల చేసిన ప్రత్యేక బుక్‌లెట్‌లో పేర్కొన్న విషయాన్ని తుంగలో తొక్కింది. వాహనదారులకు చెల్లించే వేతనాల్లో రూ.11 వేల చొప్పున కోత విధించింది. దీంతో ఎండీయూ ఆపరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభత్వం 'ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ' పేరుతో గత ఏడాది జనవరిలో పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం నిరుద్యోగ యువకులకు మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) పేరుతో వాహనాలను సమకూర్చింది. జిల్లాలో బియ్యం పంపిణీ కోసం 374 వాహనాలను పౌర సరఫరాల సంస్థ అధికారులు అప్పట్లో అందజేశారు. వాహనం ఖరీదులో పది శాతం సొమ్మును ఎండీయూ ఆపరేటర్‌ భరించాలని, 30 శాతం సొమ్ము బాం్యకు రుణం వుంటుందని, మిగిలిన 60 శాతం సొమ్మును సంబంధిత శాఖ సబ్సిడీ ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అపరేట్లకు వాహన నిర్వహణపై మార్గదర్శకాలు, బాధ్యతలను తెలియజేస్తూ 'కరదీపిక' పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఏటా రూ.11 వేల చొప్పున ఆరేళ్లపాటు ఇన్స్యూరెన్స్‌ సొమ్మును పౌరసరఫరాల సంస్థ చెల్లిస్తుందని ఈ బుక్‌లెట్‌లోని 19వ పేజీలో స్పష్టంగా పేర్కొంది. తొలిఏడాది ఇన్స్యూరెన్స్‌ సొమ్మును పౌరసరఫరాల సంస్థ చెల్లించింది. అయితే ఈ ఏడాది సంస్థ చేతులెత్తేసింది. బీమా సొమ్మును ఎండీయూ ఆపరేటర్లే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది జవవరి నెలలో వాహన ఆపరేటర్ల వేతనాల నుంచి రూ.41.14 లక్షలు కోత విధించారు. దీనిపై పలువురు ఆపరేటర్లు అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. మార్గదర్శకాల పుస్తకంలో ఆరేళ్లపాటు బీమా సొమ్మును పౌరసరఫరాల సంస్థ చెల్లిస్తుందని పేర్కొనగా, ఆపరేటర్లతో చేసుకున్న లిఖితపూర్వక ఒప్పందంలో మాత్రం బీమా సొమ్మును ఏడాది తరువాత ఆపరేటర్లే చెల్లించాలని వుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)