అనుమతులతోనే రుషికొండ పనులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఐ.టి., పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావడం తథ్యమని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు, కొన్ని మీడియా సంస్థలకు కడుపు మంట అని దుయ్యబట్టారు. 'ఈనాడు' ప్రధాన సంచికలో 'రుషికొండ పిండి' పేరుతో కథనం రాశారని పేర్కొంటూ.. సి.ఆర్‌.జెడ్‌. అనుమతుల మేరకే అక్కడ పర్యాటక ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వెల్లడించారు. గతంలో ఉన్న రిసార్టు స్థానంలోనే కొత్తగా ఐదు నక్షత్రాల రిసార్టును కడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకునే నిర్మాణాలు చేస్తున్నారని మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడించారు. విశాఖపట్నం బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చంద్రబాబునాయుడు నడుం బిగించారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం రాకుండా ఆపాలని తెదేపా కుట్రపూరితంగా పిటిషన్లు వేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాలు నిర్మిస్తుంటే వెంటనే కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని గుర్తుచేశారు. విశాఖలో 1.50 లక్షల మందికి అందాల్సిన ఇళ్లపట్టాలు అందకుండా బాబు మనుషులే కోర్టులకెళ్లి అడ్డంకులు సృష్టించారన్నారు. వాటిని అధిగమించి 1.50 లక్షల మంది సొంతింటి కలను నెరవేర్చేలా ఈనెల 28న విశాఖలో ముఖ్యమంత్రి పట్టాలు పంచే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పవన్‌కల్యాణ్‌తో అమర్‌నాథ్‌ గతంలో తీయించుకున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయంపై విలేకరులు ప్రశ్నించగా, జగన్‌మోహన్‌రెడ్డి కారణంగా తనకు వచ్చిన ఇమేజ్‌ను చూసి చాలామంది తనతో ఫొటో తీయించుకున్నారని పేర్కొన్నారు. పవన్‌కల్యాణే తనతో ఫొటో తీయించుకున్నారని అన్నారు. అందులో పవన్‌ను చూపిస్తూ ఎవరు చేతులు కట్టుకుని ఉన్నారో చూడండి అంటూ తనలాంటి వాడితో ఫొటో తీయించుకునేటప్పుడు వినయం ప్రదర్శించాలని అన్నారు. అసలు రెండుచోట్ల ఓడిపోయిన వాళ్లతో తానెందుకు ఫొటో తీయించుకుంటానని ప్రశ్నించారు. ఆయన తనతో ఎప్పుడు ఫొటో తీయించుకున్నారో గుర్తులేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)