నన్ను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదే !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది ఎమ్మెల్యేలకి గ్రాఫ్ తగ్గడం వల్ల గడపగడపకీ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చేయాలంటూ సీఎం జగన్ తమను ఆదేశించినట్లు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా కూడా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. అలాగే ఇకపై గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేలకి టిక్కెట్టు ఇవ్వడం జరగదని కూడా అధినేత క్లారిటీ ఇచ్చారన్నారు. తనను మంత్రిగా తప్పించడానికి కారణం ఏంటన్నదానిపైనా వివరణ ఇచ్చారు. వైసీపీ తరపున ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా ప్రజలు, పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకుని తిరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవడానికి పార్టీ నేతలంతా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే గతంలో ఓడిపోయిన సీట్లపైనా దృష్టి సారిస్తామన్నారు. గతంలో ఓటమిపాలైన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు ఇతర సీట్లపై వైసీపీ ఈసారి దృష్టిపెడుతున్న నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాంతీయ సమన్వయ కర్త హోదాలో బాలినేని చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినట్లే కనిపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన.. వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని గుర్తు చేశారు. అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు. గడప గడపకే నేను తిరుగుతాను.. కానీ, నన్ను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. మంత్రి పదవిలో నుండి తనను ఎందుకు తీసేశారని కొంత మంది అడుగుతున్నారని, మరి బంధువు కాబట్టి మంత్రి పదవి నుండి తొలగించానని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతున్నారని తెలిపారు. నన్ను అడ్డం పెట్టుకుని చాలా మందిని మంత్రి పదవి నుండి తొలగించానని కూడా తెలిపారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వ పథకాల అమలు కోసం పనిచేయాల్సిన వాలంటీర్లపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంగా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)