ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు

Telugu Lo Computer
0


లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు ఆర్మీ వైస్ చీఫ్‌గా శుక్రవారం నియమితులయ్యారు. 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్‌ పాండే స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. మే 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా బీఎస్‌ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. 38 ఏళ్లగా ఆర్మీలో సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్‌ రాజు ప్రస్తుతం ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎవో) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సున్నితమైన లడఖ్ సెక్టార్‌లో రెండేళ్లుగా చైనాతో కొనసాగుతున్న సరిహద్దులోని పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటకలోని సైనిక్ స్కూల్ బీజాపూర్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి అయిన బీఎస్‌ రాజు, 1984 డిసెంబర్ 15న జాట్ రెజిమెంట్‌లో నియమితులయ్యారు. హెలికాప్టర్ పైలట్ అయిన ఆయన, ఆపరేషన్‌ పరాక్రమ్‌లో వెస్ట్రన్ థియేటర్‌ బెటాలియన్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉరి బ్రిగ్రేడ్‌కు, శ్రీనగర్‌లోని 15 కార్ప్స్‌ హెడ్‌ క్వాటర్స్‌ కౌంటర్ తిరుగుబాటు దళానికి నేతృత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ బీఎస్‌ రాజు భూటాన్‌లో భారత సైనిక శిక్షణ బృందానికి కమాండెంట్‌గా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్‌లో భాగంగా సోమాలియాలో సేవలందించారు. ఆయన ఎన్నో కెరీర్ కోర్సులను అభ్యసించారు. బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. అమెరికా మోంటెరీలోని నావల్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ స్కూల్ నుంచి కౌంటర్ టెర్రరిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)