రష్యా గగనతలం మూసివేత

Telugu Lo Computer
0


రష్యా గగనతలం గుండా అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాల విమానాలు ప్రయాణించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ దేశాల విమానయాన సంస్థలు నడిపే విమానాల్లో భారత దేశానికి రావడానికి ప్రయాణ కాలంతోపాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అయితే భారతీయ విమానయాన సంస్థలు మాత్రం రష్యన్ గగనతలాన్ని ఉపయోగించుకోగలుగుతుండటం గమనార్హం. విమానాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Flightradar24 ఈ వివరాలను వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ముందు, తర్వాత పరిస్థితిని వివరించింది. మార్చి 1న నెవార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం రష్యన్ గగనతలం గుండా ప్రయాణం చేయలేదు. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం, యూరోపు, మధ్య ప్రాచ్యం మీదుగా భారత దేశానికి చేరుకుంది. మొత్తం మీద ప్రయాణ కాలం సుమారు 13 గంటల 53 నిమిషాలుగా నమోదైంది. ఇదే విమానం ఫిబ్రవరి 2న, అంటే యుద్ధానికి ముందు, రష్యన్ గగనతలం గుండా నెవార్క్ నుంచి ఢిల్లీ రావడానికి సుమారు 12 గంటల 38 నిమిషాలు పట్టింది. ఎయిరిండియా విమానం నెవార్క్ నుంచి ఢిల్లీ చేరుకోవడానికి మార్చి 1న 13 గంటల 19 నిమిషాలు పట్టింది. ఈ విమానం రష్యన్ గగనతలాన్ని అంతకుముందు మాదిరిగానే ఉపయోగించుకుంది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24కు పూర్వం కూడా ప్రయాణ కాలం ఇదే విధంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)