విశాల్‌ జట్టు విజయం

Telugu Lo Computer
0


చెన్నైలోని దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో విశాల్‌ జట్టు మరోసారి విజయం దక్కించుకుంది. సుమారు రెండేళ్ల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగినప్పటికీ ఈ ఎన్నికల్లో విశాల్‌ జట్టు విజయం సాధించింది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కౌంటింగ్‌ నుంచి భాగ్యరాజ్‌ జట్టు వాకౌట్‌ చేసింది. 2019 లో నడిగర్‌ సంఘానికి ఎన్నికలు జరిగాయి. సీనియర్‌ దర్శకులు, నటుడు భాగ్యరాజ్‌ సారధ్యంలో 'స్వామి శంకరదాస్‌' జట్టు, నాజర్‌-విశాల్‌ సారధ్యంలో 'పాండవర్‌ అని' జట్లు పోటీ చేశాయి. ఎన్నికలను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఈ ఎన్నికలు చెల్లవని, కౌంటింగ్‌ ప్రక్రియను నిషేధించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పోలింగ్‌ బాక్సులను నుంగంబాక్కంలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఈ తీర్పును సవాలు చేస్తూ విశాల్‌ జట్టు మరో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం విశాల్‌ జట్టుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంగంబాక్కంలోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాలలో జరిగింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాజర్‌ ఘన విజయం సాధించారు. ఆయనకు 1,701 ఓట్లు లభించగా, భాగ్యరాజ్‌కు 1054 ఓట్లు దక్కాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్‌ 1720 ఓట్లు సొంతం చేసుకోగా, ఐసరి గణేశ్‌కు 1,032 ఓట్లు పడ్డాయి. అలాగే కోశాధికారి పదవికి పోటీ చేసిన కార్తికి 1827, ప్రశాంత్‌కు 919 ఓట్లు వచ్చాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)