ఒకే ఒక్క దొంగతనంతో లైఫ్ లో సెటిల్...కానీ కథ అడ్డం తిరిగితే ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నగరానికి చెందిన రాజేష్ ఐటీఐ పూర్తి చేసి ఇళ్లలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం జూదం, దొంగతనం అనే రెండు మార్గాలు ఎంచుకున్నాడు. వీటిలో దొంగతనం అయితే సేఫ్ అని భావించి తెలివిగా ఆలోచించాడు. ఒకే ఒక్క దొంగతనంతో లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావించాడు. తనకున్న పరిచయాలతో రెండు ఇళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. వారితో చనువుగా ఉంటూ పధక రచన చేశాడు. మార్చి 13వ తేదీన ఆ రెండిళ్లకు చెందిన వారు ఒకేసారి ఊరు వెళ్లారు. అదే అదనుగా అదే రోజు రాత్రి రెండిళ్లలోకి చొరబడ్డాడు. కిలోన్నరకు పైగా బంగారం, మూడు కేజీల వెండి, ఐదు లక్షల నగదు దోచుకెళ్లాడు. తర్వాతి రోజు వచ్చిన యజమానులు దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం రాకుండా ఉండటానికి అదే సమయంలో అక్కడికి వెళ్లి దొంగతనం జరిగిందా అంటూ సానుభూతి చూపించాడు. మరోవైపు పోలీసులు క్లూజ్ టీమ్ ను రంగంలోకి దింపారు. రెండిళ్లలో ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి యజమానులతో సన్నిహితంగా ఉండే వారి వేలిముద్రలు సేకరించడంతో రాజేష్ గుట్టురట్టయింది. కొన్నిరోజులు రాజేష్ పై నిఘా ఉంచి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడి లేక తాను దొంగతనానికి పాల్పడినట్లు రాజేష్ విచారణలో వెల్లడించాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)