నాకున్నది ఇద్దరూ ఆడపిల్లలే !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ తనకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారనే విషయాన్ని గర్వంగా చెబుతున్నానని వైఎస్ జగన్ చెప్పారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తాను ప్రతి క్షణం గర్విస్తుంటానని అన్నారు. ఇదివరకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కూతురిని కంటానంటే అత్త వద్దు అని చెప్పే రోజులు కావని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నాటి రోజులు కావని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కువ మంది మహిళలకు లబ్ది కలిగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, దిశ చట్టాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్‌లో అమలు చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడారు. మహిళల కోసం చట్టాలు చేసిన తొలి ప్రభుత్వం ఏపీనేనని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ పొరుగు రాష్ట్రాలతో కాకుండా దేశంతోనే పోటీ పడుతోందన్నారు. దేశ చరిత్రలోనే ఇంతమంది మహిళలను ప్రజా ప్రతినిధులను చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్స్, చైర్‌ పర్సన్లుగా, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లుగా, మేయర్లుగా ఇలా ఏదో ఒక కార్పొరేషన్‌కు చైర్‌పర్సన్‌గానో, డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని, 1993 నుంచి పార్లమెంట్‌లో బిల్లులు పెడుతూనే ఉన్నారని, ఇప్పటి వరకు దాన్ని ఆమోదించిన దాఖలాలు లేవని అన్నారు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకున్నా ఎవరు అడగకపోయినా..నామినేషన్‌ పోస్టులు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి మహిళలకే కేటాయించామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లలో 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా తమదేనని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా ఎస్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, రాష్ట్ర తొలి దళిత హోమ్ మంత్రిగా సుచరిత, తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికల అధికారిణిగా నీలం సాహ్నిని నియమించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వీరంతా మహిళా అభ్యుదయ భావజాలానికి నిదర్శనమని ప్రశంసించారు. 2.60 లక్షల మందిని వలంటీర్లుగా నియమిస్తే,  ఇందులో 53 శాతం, గ్రామ సచివాలయాల్లో 51 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని, వారంతా చిరునవ్వుతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దిశ బిల్లుకు రూపకల్పన చేశామని, చట్టసభలో ఆమోదం తెలిపామని వైఎస్ జగన్ గుర్తుచేశారు. సాక్ష్యాధారలు ఉన్న కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ చేసి 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని చట్టం చేశామని పేర్కొన్నారు. ఆ బిల్లు కేంద్రంతో ముడిపడి ఉన్న అంశమని, కేంద్రం ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. బాలికలు, మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటివరకు 1.13 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అన్నారు.




Post a Comment

0Comments

Post a Comment (0)