దోపిడీకి పాల్పడుతున్న ముఠా సూత్రధారి అరెస్ట్‌

Telugu Lo Computer
0


అంతర్రాష్ట్ర రహదారి దోపిడీల సూత్రధారిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈయన ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి రూ.23.60 లక్షల విలువైన వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ ముఠా దోచుకున్న దానిలో 91 శాతం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సౌత్‌ కోస్టల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సీఎం త్రివిక్రమ్‌ వర్మ, ప్రకాశం ఎస్పీ మాలిక గార్గ్‌ మీడియాకు వెల్లడించారు. డీఐజీ తెలిపిన వివారల ప్రకారం 2021 ఆగస్ట్ 14 న గుడ్లూరులో పార్క్ చేసిన కంటైనర్‌ నుంచి డొలో-650 ట్యాబ్లెట్‌ బాక్సులను దొంగిలించినట్లు కేసు నమోదైంది. వారం రోజులుగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని టంగుటూరు, శ్రీసిటీ, కోవూరు, బంగారుపాలెం, కాణిపాకం, దగదర్తి తదితర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు నమోదవుతుండటంతో పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి వీరిపై నిఘా పెట్టారు. ఈ బృందాలు తమిళనాడులో పర్యటించి ఇలాంటి దొంగల సమాచారం సేకరిస్తుండగా ఇసుకదర్శిలో ఇదే విధమైన నేరం నమోదైంది. ఇక్కడ దుండగులు 23 బ్యాగుల రెడీమేడ్ దుస్తులను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద లారీని గమనించి ఆపే ప్రయత్నం చేశారు. అయితే ట్రక్కును, చోరీ సొత్తును అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసు బృందాలు తమిళనాడులో నిఘాపెట్టి మన్నాడీలో నివిసిస్తున్న ప్రధాన సూత్రధారి మసిలమని ప్రకాష్‌ పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ముత్తు, పొన్ రాజ్, కుమార్‌లతో కలిసి ప్రకాష్ ముఠాగా ఏర్పడి జాతీయ రహదారులపై నిలిపి ఉంచే ట్రక్కులు, కంటైనర్ల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నారు. నిందితుడు 2021లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 10 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మిగతా ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన సూత్రధారిని పట్టుకున్న పోలీసులను డీఐజీ త్రివిక్రమ వర్మ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)