విభజన చట్టానికి సవరణలు అవసరం లేదు

Telugu Lo Computer
0


రాష్ట్ర విభజన జరిగిన ఏడున్నరేండ్ల తరువాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విభాగం జాయింట్‌ సెక్రటరీ ఆశిష్ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాస్‌రావు, ఐఏఎస్‌ అధికారులు నీతూప్రసాద్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్  నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో వసూలయ్యే పన్నుల్లో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్‌ చేసిన వాదనను తెలంగాణ గట్టిగా వ్యతిరేకించింది. తెలంగాణతో ఏకీభవించిన కేంద్ర హోంశాఖ ఈ అంశం విభజన సమస్యల కిందకు రాదని స్పష్టంచేసింది. ఎజెండా నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సమావేశంలో విద్యుత్తు బకాయిలు, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, పన్నుల కోసం విభజన చట్టానికి సవరణ, నగదు నిల్వల పం పిణీ, పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీల అం శాలను చర్చించారు. విద్యుత్తు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడాన్ని తెలంగాణ అధికారులు ఎండగట్టారు. మందుగా కోర్టుల్లో వేసిన కేసులు విత్‌డ్రా చేసుకుంటే, సమస్యలన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు తేల్చి చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు మిన్నకుండి పోయారు. కేంద్రం కూడా స్పందించలేదు. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో రెండు రాష్ర్టాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ప్రభు త్వం 2016లోనే కేంద్రానికి లేఖ రాసినప్పటికీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్‌ఎఫ్‌సీకి కేటాయించిన 235.34 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుకెళ్లి స్ట్టేటస్‌కో తెచ్చింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న ఎస్‌ఎఫ్‌సీ ఆపరేషనల్‌ యూనిట్‌ భవనాన్ని పంచాలంటూ కోర్టులో ఏపీ మరో కేసు వేసింది. ఈ కేసులను ఉపసంహరించుకుంటేనే పురోగతి ఉంటుందని తెలంగాణ స్పష్టంచేసింది. అప్పటివరకు ఏపీ ఏకపక్షంగా చేసిన విభజన ప్రతిపాదనను ఆమోదించవద్దని కేంద్రాన్ని కోరింది. పన్నుల వ్యవహారం విభజన చట్టం పరిధిలోకి రాదు. తెలంగాణ ఆదాయంపై కన్నేసిన ఏపీ ఏకంగా హైదరాబాద్‌ నుంచి వచ్చే పన్నుల్లో వాటా కావాలని వింత డిమాండ్‌ చేసింది. ఇందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు చట్ట సవరణ చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ సీరియస్‌ అయింది. చట్టానికి సవరణలు అవసరం లేదని స్పష్టంచేసింది. ఏమాత్రం సవరణ చేసినా పరిష్కరించడానికి సాధ్యం కాని అంతులేని క్లిష్టమైన సమస్యలు వస్తాయని తెలిపింది. తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం ఇది విభజన సమస్య కాదని దీనిని ఎజెండా నుంచి తొలగిస్తామని తెలిపింది. తెలంగాణకు రావాల్సిన రూ.1,483.60 కోట్ల నగ దు నిల్వలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ అధికారు లు కేంద్రం ముందు ఏపీని డిమాండ్‌ చేశారు. జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాల్సిన నిధులు పంపిణీ చేయకుండా ఏపీ కాజేయడంపై తెలంగాణ అధికారులు సీరియస్‌ అయ్యారు. సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్స్‌కు సంబంధించి రూ.495.21 కోట్లు, ఉమ్మడి హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయాన్ని విభజన జరిగే వరకు తెలంగాణ ఖర్చు చేసింది. దీనికి సం బంధించిన బకాయి రూ. 315.76 కోట్లు, భవన నిర్మా ణ కార్మికుల సంక్షేమబోర్డులో తెలంగాణ వాటా డిపాజిట్‌ రూ.464.30 కోట్లు, నికర క్రెడిట్‌ క్యారీ ఫార్వర్డ్‌ (ఎన్‌సీసీఎఫ్‌) నిధులు రూ.208. 24 కోట్లు ఇవ్వాలని కోరింది. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలను పంపించాలని తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కేంద్రం హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ కోరారు. ఏపీ నిర్వాకం వల్ల తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు ఎస్బీఐలో క్యాష్‌క్రెడిట్‌ దక్కని విపత్కర పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం సబ్సిడీలన్నీ ఏపీ ఖాతాలో పడ్డాయి. వాటిని తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ సర్కారు వాడుకున్నది. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన పంటలకు డబ్బులు ఇవ్వడానికి బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రూ.354.08 కోట్లు బ్యాంకులకు బకాయిపడింది. ఈ అంశంపై జరిగిన చర్చల్లో ఈసారి కేంద్రం నుంచి తమకు సబ్సిడీ రాగానే ఇస్తామని ఏపీ తెలిపింది. ఇందుకు అండర్‌టేకింగ్‌ ఇస్తామని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)