సింగరేణి జోలికి వస్తే ఖబడ్దార్ !

Telugu Lo Computer
0


సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలోని నల్ల బంగారం యావత్ తెలంగాణకే కొంగు బంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపిని కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని ఆయన అన్నారు. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి చేరుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేండ్ల కాలంలో సింగరేణి అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు సాగుతోంది. అలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని ఆయన ఆరోపించారు. సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి దాకా సింగరేణిలో 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదు. గనులు మూతపడిన కొద్ది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటి అన్ని పోతాయి. అంతిమంగా సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు కార్మికులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి తారకరామారావు విరుచుకుపడ్డారు. సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6 , శ్రవనపల్లీ ఒసి, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించిదని అలా చేస్తే ఈ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)