నీటి సరఫరా నిలిపేసిన వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు

Telugu Lo Computer
0


రేణిగుంట ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు, తిరుపతి డిప్యూటీ మేయర్‌కు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం నీటి సరఫరా నిలిపివేసే దాకా తీసుకొచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బందితో పాటు, రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వారికి స్వాగతం పలికేందుకు తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తన అసిస్టెంట్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అయితే డిప్యూటీ మేయర్‌ను ఎయిర్‌పోర్టు మేనేజర్ సునీల్ ఆపారు. ఎయిర్‌పోర్టులోకి మీకు అనుమతి లేదని అభియన్ రెడ్డికి చెప్పడంతో సునీల్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ తీవ్రమైన పదజాలంతో దూషించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుమారుడే అభినయ్ రెడ్డి. ఎయిర్ పోర్టు మేనేజర్ తనను అడ్డుకున్నారన్న కోపంతో డిప్యూటీ మేయర్ ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరాను ఆపేశారు. స్టాఫ్‌తో పాటు ఎయిర్‌పోర్టు క్వార్టర్స్‌లో ఉంటున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పైపుల మరమ్మతు కారణంగానే నీటి సరఫరాను నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్పడంతో ఇదే అదునుగా భావించిన మున్సిపల్ అధికారులు.. తెలుగు గంగా వాటర్‌లో డ్రైనేజీ వాటర్ కలుస్తోందని, మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఈ వివాదంపై టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ స్పందించారు. డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి నిర్ణయం సరికాదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)