కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లబ్ధికి యోచన !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు, పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని, అలాగే దేశంలో యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను ప్రారంభించడం గురించి ఓ కొత్త ప్రతిపాదన రాబోతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.  ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్టు జీ న్యూస్ హిందీ కథనం ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులకు కనీసం నెలకు రూ. 2,000 పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసినట్టు వార్తా కథనం వెల్లడించింది. సీనియర్ సిటిజన్లకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కూడా కమిటీ కోరింది. పెన్షనర్లు ఈ ప్లాన్ నుంచి ప్రయోజనం పొందొచ్చు. ఈ నివేదికలో సామాజిక భద్రతా, నైపుణ్యాభివృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పొడిగించాల్సి ఉంటుందనీ, 50 ఏళ్లు పైబడిన వారికి నైపుణ్యాభివృద్ధి అందించాలని కూడా ఈ నివేదిక చెబుతోంది. వ్యక్తిగత నైపుణ్యాలను డెవలప్ చేసేలా, ప్రతిభను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని నివేదిక సూచించింది. అంటే అసంఘటిత రంగంలో పని చేసేవారు, మారుమూల ప్రాంతాలలో ఉన్నవారు, శరణార్థులు, వలస వచ్చిన ప్రజలు, తగిన వనరులు లేని వారికి అధికారిక శిక్షణ అందించడం లాంటివి చేయాలి. నైపుణ్యం కలిగిన వ్యక్తుల లోటుతో ఏ డిపార్ట్‌మెంట్ కష్టపడకుండా చూసుకోవాలి. ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2019 ప్రకారం, 2050 నాటికి భారతదేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉండే అవకాశం ఉంది. అంటే జనాభాలో 19.5% మంది పదవీ విరమణ చేయనున్నారు. అందుకే వారి శ్రేయస్సుకై ఆలోచించాలని ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. వీటితో పాటు 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వారం శుభవార్త వస్తుందని సమాచారం. డీఏ అంశంపై ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ అక్టోబర్ 2021 కి సంబంధించి 17 శాతాన్ని 31% గా పునరుద్ధరించారు. అయినప్పటికీ దానికి సంబంధించిన బకాయిలు ఉద్యోగులకు ఇవ్వలేదు. తాజాగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఒక్కసారిగా మొత్తం డీఏ, డీఆర్ అలవెన్స్ సొమ్ము పడుతుందని అంటున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ JCM, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖలు.. ఈ బకాయిల అంశంపై చర్చించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)