గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత

Telugu Lo Computer
0


మధ్య-తూర్పు ఆసియా దేశాల్లో మరోసారి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యెమెన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మద్దతు ఇస్తోన్నట్లుగా అనుమానిస్తోన్న హౌతీ తిరుగుబాటుదారులు.. అరబ్ ఎమిరేట్స్‌పై బాంబు దాడికి పాల్పడ్డారు. డ్రోన్లతో వరుసగా బాంబులను విసిరారు. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగించారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తాన్ దేశస్థుడు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని అబుధాబి పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడింది హౌతీ తిరుగుబాటుదారులేనని నిర్ధారించారు. ఈ దాడి తరువాత ఒక్కసారిగా మధ్య-తూర్పు ఆసియా దేశాల్లో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరబ్ ఎమిరేట్స్‌కు సౌదీ అరేబియా అండగా నిలిచింది. హౌతీ తిరుగుబాటుదారులను అణచి వేయడానికి రంగంలోకి దిగింది. యెమెన్‌పై వైమానిక దాడులు చేసింది. రాజధాని సనాలోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులను సంధించింది. సనాపై వైమానిక దాడులను మొదలు పెట్టినట్లు సౌదీ అరేబియా ప్రెస్ ఏజెన్సీ అల్-ఇఖ్‌బారియా తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై డ్రోన్లతో బాంబుదాడికి పాల్పడటానికి ప్రతీకారంగా ఈ దాడులను సాగించింది. సౌదీ అరేబియా సారథ్యంలో కొనసాగిన ఈ దాడుల్లో అరబ్ ఎమిరేట్స్ సైనిక బలగాలు కూడా పాల్గొన్నాయి. ఈ వైమానిక దాడులను హౌతీ తిరుగుబాటుదారులు ధృవీకరించారు. తమ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ సారథ్యంలోని సైనిక దళాలు బాంబులను జారవిడిచినట్లు అల్-మసీరా టీవీ ఛానల్ తెలిపింది. ఈ మేరకు హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా షారీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రతీకార దాడుల వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటిదాకా వార్తలు రాలేదు. భారీగా ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. సనాలోని హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. కొందరు తిరుగుబాటుదారులు గాయపడినట్లు సమాచారం ఉంది. ముసప్ఫా పారిశ్రామిక ప్రాంతంలో గల అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అల్ బతీన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండు బాంబుదాడులు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని మూడు ఆయిల్ ట్యాంకర్లు ఈ దాడిలో ధ్వంసమైనట్లు చెప్పారు. డ్రోన్లతో బాంబు దాడులను చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అబుధాబి పోలీసులు ఈ ప్రకటనను విడుదల చేసిన కొద్దిసేపటికే యెమెన్ హౌతీ ఉద్యమకారులు స్పందించారు. ఈ దాడికి తామే కారణమని వెల్లడించారు. హౌతీ తిరుగుబాటుదారుల ఈ దాడి తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిగిలిన గల్ఫ్ దేశాలు దీన్ని తీవ్రంగా పరిగణించాయి. దీన్ని తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నామంటూ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతర్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని వివరాలను సేకరించింది. అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ అల్-నహ్యాన్ స్పందించారు. యెమెన్‌ను శిక్షించి తీరుతామని హెచ్చరించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని, వారి మరణానికి కారణం కావడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతీకార దాడులు చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనీ స్పష్టం చేశారు. ఆయన ఈ హెచ్చరికలను జారీ చేసిన కొన్ని గంటల్లోనే సౌదీ అరేబియా సారథ్యంలోని సైనిక బలగాలు యెమెన్‌పై వైమానిక దాడులకు దిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)