ఆలయ ప్రవేశాన్ని అడ్డగించిన పెత్తందారులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నార్పల మండలం గుంజెపల్లిలో దళితుల ఆలయ ప్రవేశాన్ని అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారు. దీనిపై దళితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామం లోని ఆలయంలోకి వెళ్లే హక్కు తమకూ ఉందన్నారు. అయినా పెత్తందారులు అలయంలోకి అనుమతించకపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దళితులు తెలిపిన మేరకు గుంజెపల్లి గ్రామంలోని రామస్వామి ఆలయంలోకి దళితులను అనుమతిం చడంలేదు. గుడిలోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ గత కొంతకాలంగా పెత్తందార్లను దళితులు కోరుతున్నా ఫలితంలేకుండా పోయింది. దీంతో సోమవారం పలువురు దళితులు ఆలయంలో రామస్వామిని దర్శించుకునేందుకు బయళ్దేరారు. ఆలయం వద్ద వారిని అదే గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులు అడ్డుకున్నారు. గ్రామంలో ఈ గుడిని రెడ్డి, బోయ సామాజిక తరగతులకు చెందివారిమి చందాలు వేసుకుని నిర్మించుకున్నామని, ఇందులోకి దళితులు వెళ్లేందుకు వీల్లేదని అభ్యంతరం చెప్పారు. ఊరిలో ఉన్న తమకు ఆలయంలోకి వెళ్లేందుకు హక్కు ఎందుకు లేదంటూ వారిని దళితులు ప్రశ్నించారు. సమాచారం అందుకున్న నార్పల తహశీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, ఎంపిడిఒ దివాకర్‌, సిఐ విజయభాస్కర్‌ గౌడ్‌, ఎస్‌ఐ వెంకటప్రసాద్‌లు గ్రామానికి చేరుకుని ఇరువురికి సర్ధిచెప్పారు. తమకు ఆలయ ప్రవేశం చేయించాల్సిందే అంటూ దళితులు పట్టుబట్టారు. చర్చల అనంతరం సాయంత్రం ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు దళితులకు తెలిపారు. అగ్రకుల పెత్తందార్లు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడటంతో దళితులు ఆలయ ప్రవేశ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తరువాత అయినా ఆలయ ప్రవేశం చేసి తీరుతామంటూ వారు తేల్చి చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)