కేరళ లో కిలాడీ భార్యాభర్తల బాగోతం !

Telugu Lo Computer
0


కేరళ లోని సాలెం జిల్లాలోని వీరణం ప్రాంతానికి చెందిన లలిత, తంగరాజన్(40) భార్యాభర్తలు. ఈ దంపతులు సాలెంలోని రాజగణపతి ఆలయం దగ్గర లలితాంబిక జువెలర్స్ అనే నగల దుకాణం కొన్నేళ్ల నుంచి నడుపుతున్నారు. సరికొత్త మోడల్స్ అన్నీ విక్రయిస్తూ ఉండటంతో వీరి నగల దుకాణానికి మంచి ఆదరణే లభించింది. అయితే.. ఈ గుడ్‌విల్‌ను ఉపయోగించుకుని మరింత డబ్బు సంపాదించాలని లలిత, తంగరాజన్ భావించారు. ఏడాది, రెండేళ్ల పాటు నెలకు ఇంతని డబ్బు చెల్లిస్తే ఎక్కువ వడ్డీ చెల్లించడంతో పాటు తమ వద్ద చీటీలు కట్టిన వారికి తక్కువ ధరకు బంగారం పొందే సదుపాయం కల్పిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొన్నేళ్ల నుంచి ఉన్న దుకాణం కావడంతో వీళ్లను జనం సులువుగా నమ్మారు. చీటీలు వేసిన చాలామంది బంధువులకు కూడా చెప్పి వాళ్లతో కూడా కట్టించారు. ఇంకేముంది ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేసిన ఈ భార్యాభర్తల కోరిక త్వరగానే నెరవేరింది. జనం కట్టగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపారు. సాలెం పట్టణం నుంచి మాత్రమే కాదు పూనమ్మపేట్, అమ్మపెట్టై, వీరణం ప్రాంతాల నుంచి కూడా చాలామంది వీరికి చీటీ డబ్బులు కట్టారు. జనాలకు డబ్బు చెల్లించే ఉద్దేశం ఏమాత్రం లేని ఈ దంపతులు రాత్రికి రాత్రి ఉడాయించారు. గురువారం ఉదయం బంగారం షాపు ఓపెన్ చేయకపోవడంతో డబ్బు కట్టిన కస్టమర్లకు అనుమానమొచ్చింది. షాపులో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్యం సరి లేదని, మూడు రోజుల తర్వాత షాపు ఓపెన్ చేస్తామని స్టోర్ షట్టర్‌కు ఓ నోటీస్ మాదిరిగా పేపర్ అంటించారు. అది చూసి అవాక్కైన బాధితులు తంగరాజన్ ఇంటికి వెళ్లారు. తంగరాజన్ ఇంటికి తాళం వేసి ఉండటంతో అసలు విషయం బాధితులకు అర్థమైపోయింది. తంగరాజన్ పూనమ్మపేట్‌లోని అతని మామయ్య వాళ్ల ఇంటిలో ఉన్నాడన్న సమాచారంతో బాధితులు ఆ ఇంటికి వెళ్లారు. అయితే ఆ ఇంట్లో తంగరాజన్ గానీ, అతని భార్య గానీ లేదు. దీంతో అదే ఇంటి ముందు న్యాయం చేయాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గొడవ జరుగుతుందని తెలిసి పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. తంగరాజన్‌పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా షాపులో ఉన్న నగలను రాత్రికి రాత్రే ఎవరూ చూడకుండా రెండు రోజుల ముందే కారులో తీసుకెళ్లిన దృశ్యాలు చూసి కస్టమర్లు అవాక్కయ్యారు. ఆ వీడియోలో తంగరాజన్‌తో పాటు షాపులో పనిచేసే కొందరు షాపులోకి వెళ్లి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కారులోకి సర్దడం స్పష్టంగా కనిపించింది. దీంతో తంగరాజన్ తనకు డబ్బు కట్టిన వారిని మోసం చేసి భార్యతో కలిసి చెక్కేయాలని ప్లాన్ చేసినట్లు తేలిపోయింది. తంగరాజన్, అతని భార్య లలిత ఈ స్కాంలో భాగమైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రూ.4 కోట్లకు టోకరా వేసి ఈ కిలాడీ భార్యాభర్తలు చెక్కేశారు. పోలీసులు ఈ ఘరానా జంట కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వందల మంది బాధితులు వీరి చేతిలో మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. జనాన్ని మాత్రమే కాదు కొందరు తోటి నగల దుకాణ యజమానులను కూడా ఈ జంట మోసం చేసింది. షాపులోకి బంగారం, వెండి ఆభరణాలను అప్పు చేసి మరీ తెచ్చి పెట్టుకున్నారు. కొన్నేళ్ల నుంచి క్రయవిక్రయాలు సాగుతుండటంతో నమ్మి ఇచ్చిన ఆ జువెలరీ షాపుల యజమానులు నిలువునా మోసపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)