కుక్క పుట్టినరోజున బిర్యానీ దానం

Telugu Lo Computer
0


కర్ణాటకలోని షిమోగా పట్టణానికి చెందిన మొహమ్మద్ అయాజ్ అనే వ్యక్తికి కుక్కలంటే చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక హోటల్ లో పనిచేస్తున్న అయాజ్ ఆ హోటల్ కి వచ్చిన ఒక కుక్కను పెంచి పోషించాడు. అయితే కొన్ని రోజులకు ఆ కుక్కను, దాని రెండు పిల్లలను ఎవరో తీసుకువెళ్లారు. దీంతో అయాజ్ గత ఏడాది జనవరి 14న రూ.28 వేలు పెట్టి ఒక “సైబీరియన్ హస్కీ” జాతి కుక్కను కొని దానికి “టైసన్” అని పేరుపెట్టాడు అయితే కుక్కను ఇంటికి తీసుకొచ్చేందుకు అయాజ్ కుటుంబ సభ్యులు సస్సేమిరా అనడంతో కుక్కతో సహా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. షిమోగా పట్టణంలో చిన్నాచితకా కూలి పనులు చేసుకునే అయాజ్ తన టైసన్ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇటీవల “టైసన్” పుట్టిన రోజు సందర్భంగా దానికి రూ.13 వేలు విలువ చేసే ఒక వెచ్చని పరుపును కొన్నాడు. అంతే కాదు హృదయాకారంలో కేక్ తయారు చేయించి స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు నిర్వహించాడు. తన కుక్కపై ప్రేమను చాటేందుకు ఇవేవి సరిపోవని భావించిన అయాజ్ ఆరోజు సాయంత్రం 150 మందికి బిర్యానీ దానం చేశాడు. పగలంతా కూలీ పనులకు వెళ్లే అయాజ్ తన ప్రియాతిప్రియమైన కుక్కను.. కుక్కల డే కేర్ లో వదిలేసి వెళ్తాడు. సాయంత్రం ఇంటికి రాగానే దానితో కలిసి ఆడుకుంటాడు. “టైసన్ నా ప్రపంచం, దాని కోసం నేను నా సొంత వారిని వదిలేసి వచ్చాను. ప్రస్తుతం మేమిద్దరం (కుక్క-అయాజ్) ఎంతో సంతోషంగా ఉంటున్నాం” అంటూ కుక్కపై తన ప్రేమను చెప్పుకొచ్చాడు అయాజ్. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో  వైరల్ అయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)