90 శాతం ఒమిక్రాన్ కేసులే?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జనవరి మొదటి వారంలో 200లోపు ఉండే కరోనా కేసులు వారం వ్యవధిలోనే వేల మార్కు అందుకోవడం మరో వారంలోనే పదివేల మార్కును దాటడం జరిగిపోయింది. ప్రస్తుతం తాజాగా నమోదైన కేసులు చూస్తే 13 వేల మార్కును కూడా దాటేసింది. ఊహించని వేగంతో కేసులు పెరగడానికి ప్రధానకారణం నమోదవుతున్న కరోనా కేసుల్లో 90శాతం ఒమిక్రాన్ వేరియంట్ అని నిపుణులు అంటున్నారు. గతంలో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అవ్వాలంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఫలితాల గురించి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు  విజయవాడ లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ రెడీ అయ్యింది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న వాటిలో 90 శాతానికిపై గా కేసులు కొత్త వేరియంట్ వే అని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వస్తున్న శాంపిల్స్‌ ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తో పోలిస్తే కేసుల వేగం స్పీడ్ గా ఉన్నా.. ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. చేరుతున్న వారు సైతం త్వరగానే కోలుకుంటున్నారు. పాజటివ్ వచ్చిన వారంలోపే మళ్లీ వారికి నెగిటివ్ వస్తోంది. దీంతో ఒమిక్రాన్ గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదంటున్నారు. కరోనా బారిన పడిన వారిలో అత్యధికంగా కనిపిస్తున్న లక్షణాలు: తొలి రెండు రోజులు చలిచలిగా ఉండటం.. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి ఉంటోంది. మూడో రోజు నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుముఖం పట్టి జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, గొంతు మంట, పట్టేసినట్లు ఉండటం, దగ్గు వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ లక్షణాలు కూడా కరోనా సోకిన ఎక్కువ మందిలో మూడు నాలుగు రోజులుపైగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే వారం రోజుల్లో ఈ సమస్యలన్నీ పూర్తిగా నయమవుతున్నాయి. సాధారణ చికిత్సకే ఎక్కువమంది కోలుకుంటున్నట్టు గుర్తించారు. అలాగే హోం ఐసోలేషన్ లో ఉన్నవారు సైతం మూడు నాలుగు రోజులకే పూర్తి ఆరోగ్య వంతులవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న పాజిటివ్‌ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మెజారిటీ శాతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకోని వారు.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బులు సహా, ఇేదతర అదుపులో లేని కోమొర్బెడిటీ జబ్బులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో చేరిన వారి పరిస్థితిని అధికారులు పరిశీలించారు. ఒక్కరోజులో 158 మంది చేరగా, అందులో కేవలం 10 మందికి మాత్రమే ఆక్సిజన్‌ అవసరం ఏర్పడినట్లు గుర్తించారు. వీరికి ఐదు లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే బేసిక్‌ సపోర్ట్‌ కోసం వినియోగించారు. మిగిలిన 148 మందినీ పరీక్షల తరువాత సలహాలు, సూచనలిచ్చి సాయంత్రానికే ఇంటికి పంపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)