మంచు విష్ణు స్పందన ఏది?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించిన సమస్య రోజురోజుకూ పెద్దది అవుతోంది. టికెటింగ్‌ విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనుకంజ వేయకపోవడమే కాకుండా పలు ఆంక్షలు విధిస్తోంది. మరోవైపు సినిమా హాళ్లకు అవసరమైన అనుమతులు, సౌకర్యాలు లేకపోతే వాటిని సీజ్ చేయాలని ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు సినిమా హాళ్లను సీజ్ చేశారు. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. మరోవైపు చాలామంది థియేటర్ యాజమాన్యం తమ థియేటర్లను స్వచ్చందంగా మూసి వేస్తున్నారు. ఇలాంటి ఆందోళకర పరిస్థితులపై స్పందించాలని మా అధ్యక్షుడు మంచు విష్ణుపై ఒత్తిడి పెరుగుతోంది. కొంతమంది అయితే మంచు విష్ణు వెంటనే రాజీనామా చేస్తే బెటర్ అని అంటున్నారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉండి ఏం లాభం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై పోరాటం చేయడంలో తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన సహకారం ఏమాత్రం కన్పించడం లేదు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే మా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన తాజా పరిణామాలతో సంబంధం లేకుండా అవసరమైతే టాలీవుడ్‌కు అండగా నిలుస్తానని విష్ణు ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. విష్ణు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం వల్ల అవసరమైన పనులు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు టిక్కెట్ ధరల విషయంపై నాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది సరికాదు.. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న పరిశ్రమను ఇలా అణచివేయడం అన్యాయం.. ఇందులో అర్థం లేదని వ్యాఖ్యానించారు. పలువురు సినిమా ప్రముఖులు సైతం ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. మంచు కుటుంబానికి ఈ విషయంపై చీమ కుట్టినట్టుగా కూడా లేదంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అవుతారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)