అమిత్ షా నోట ముందస్తు ఎన్నికలు

Telugu Lo Computer
0


తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈ పర్యాయం కూడా అటువంటి ఆలోచన చేసే అవకాశం లేకపోలేదని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. తాజాగా అమిత్ షా కూడా ముందస్తు ఎన్నికల మాట చెప్పడంతో రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బలమయిన శక్తిగా వున్న టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై ప్రజల్లో వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోందని, ధాన్యం అంశం అందుకు ఉదాహరణ అంటున్నారు. అందుకే మంచి వేడి మీద వున్నప్పుడే ఎన్నికలకు రెడీ కావాలని భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశాడు అమిత్ షా. 'ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ' అని బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య దోస్తానా వుందని కాంగ్రెస్ ఆరోపణలకు ధీటుగా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుని కొల్లగొట్టేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ కి గతంలో కంటే తక్కువ సీట్లే వచ్చేలా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు వీలున్నప్పుడల్లా మంత్రులతో విమర్శలు చేయిస్తున్నారు. 'దళితబంధు' పథకం పైనే కేసీఆర్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ పథకం కేసీఆర్‌కు రాజకీయంగా నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం కూడా యువతపై వుంటుందని, ఇటీవల బీజేపీలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కమలం వైపు మళ్ళిస్తారని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ అన్నీ ఆలోచించి వచ్చే ఏడాది చివరి నాటికి ఎన్నికలు వెళ్తారని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ లోపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం బీజేపీకి అత్యంత అవసరం. వచ్చే ఏడాది సాధ్యమయినన్ని ఎక్కువసార్లు బీజేపీ సభలు పెట్టి తెలంగాణలో వేడిని రాజేయడానికి సిద్దం అవుతున్నారు బీజేపీ నేతలు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ గడ్డమీద గులాబీ జెండా ఎగరేయాలని కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి బీజేపీ నేతలు ఎలాంటి వ్యూహంతో కారు స్పీడ్‌కి బ్రేక్ లు వేస్తారో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)