రోడ్డుపై కరెన్సీ తుక్కు?

Telugu Lo Computer
0

 

తెలంగాణ లోని నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ నేషనల్ హైవేపై బుధవారం చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలు కుప్పలుగా కనిపించింది. లారీ నుంచి కింద పడిన సంచి పైనుంచి వాహనాలు వెళ్లడంతో.. కరెన్సీ తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు అయోమయంలో పడిపోయారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు. అవి అసలైనవా? నకిలీ నోట్లా? ఎక్కడికి తరలిస్తున్నారు?.. అసలు తుక్కుగా ఎందుకు మార్చారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అటుగా లోడ్‌తో వెళ్లిన వాహనాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఆర్‌బీఐ పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదని అధికారులు చెబతున్నారు. అది బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉందని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)