ఆ భావన వస్తే నా పతనానికి నాంది పడినట్టే!

Telugu Lo Computer
0


రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రస్తుతం చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు. నా సినిమాలో ఎవరైనా నటిస్తారు' అనే భావన వస్తే నా పతనానికి నాంది పడినట్టే. అందుకే అలాంటి ఆలోచన నాలో లేదు, రాదని చెప్పుకొచ్చారు. అలాగే మనకు దుర్యోధనుడు-కర్ణుడు, కృష్ణుడు-అర్జునుడు స్నేహితులని తెలుసు. కానీ, కృష్ణుడు-దుర్యోధనుడు ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే `ఆర్‌ఆర్‌ఆర్‌` అని తెలిపిన రాజమౌళి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఆలోచన వచ్చినప్పుడు చరణ్‌, తారక్‌ అయితే నా పాత్రకు న్యాయం చేయగలరని నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చారు. ఇక రెండున్నర సంవత్సరాలు ఎంతో ఉత్సాహంగా సినిమాను తెరకెక్కించామని ప్రతి ఒక్కరికి ఆర్ఆర్ఆర్‌ నచ్చుతుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ  వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఎం. ఎం. కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)