జగనన్నవిద్యా దీవెనపై హైకోర్టు తీర్పు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్నితల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. కానీ తాజా తీర్పుతో ఇకపై విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. తాజా తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. గతంలో విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును కోరారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌ర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టి కాలేజీ యజమానుల వాధనను ఏకీభవించింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ కూడా కొట్టేయంతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాకే అని చెప్పాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)