ఒమిక్రాన్‌ ధాటికి ఐరోపా విలవిల

Telugu Lo Computer
0


కొవిడ్ ధాటికి ఐరోపా దేశాలు అల్లాడిపోతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే అక్కడ పలు దేశాలకు వ్యాపించింది. కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని అక్కడి ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫ్రాన్స్‌లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించలేక వైద్యులు అలసిపోతున్నారు. టీకా తీసుకోని బాధితుల పట్ల వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి బ్రిటన్‌లో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కేసుల బయటపడ్డాయి. నిన్న 78,610 మందికి వైరస్ సోకింది. ఈ జనవరిలో అత్యధికంగా 68 వేల మందికి పైగా కరోనా బారినపడగా.. ఈ దఫా ఉద్ధృతిలో ఆ సంఖ్య 78 వేలకు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కోటి 10 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే అక్కడ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ భారీ అల వలే ముంచుకొస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల జాతినుద్దేశించి వ్యాఖ్యానించారు. గత వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్ పట్ల మరింత అప్రమత్తత అవసరమని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌ కూడా కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొవిడ్ వార్డుల్లో చికిత్స అందించలేక వైద్యులు అలసటకు గురవుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకోని వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై రుక్సాండ్రా డివాన్‌ మాట్లాడుతూ.. 'వ్యాక్సిన్లు తీసుకోని బాధితులకు చికిత్స అందించడటం పట్ల విసుగ్గా ఉంది. మేం నిజంగా అలసిపోయాం' అన్నారు. టీకా తీసుకోని వారి పట్ల వైద్య సిబ్బందికి కోపం, చిరాకు ఉందని మరో వైద్యురాలు ఎలిజబెత్ అన్నారు. ఆ బాధితుల్లోనే తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అందుకే చాలా మంది ఇక్కడ ఉద్యోగాలను వదులుకొని, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని చెప్పారు. డివాన్ పనిచేసే ఆసుపత్రిలో 13 ఐసీయూ పడకలు ఉండగా.. అన్నీ నిండిపోయాయి. ఆ 13 మందిలో 11 మంది టీకా తీసుకోలేదు. అందరూ యువతే. వారంతా టీకాలు తీసుకొని ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వ్యాక్సిన్ల పట్ల వీరికి ఈ అపనమ్మకం ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో ఆమె తీవ్ర అలసటకు గురవుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)