అనుమతి ఉన్నవి 65 - లేనివి 260 ?

Telugu Lo Computer
0


హైదరాబాద్‌  నగర శివారులోని దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట రెవెన్యూలోని సర్వే నెంబర్‌ 170/3, 170/4, 170/5లో శ్రీనివాస లక్ష్మీ నర్సింహ (ఎస్‌ఎల్‌ఎన్‌) కన్‌స్ట్రక్షన్స్‌ అనుమతులు లేకుండా 260విల్లాలను నిర్మించింది. మల్లంపేట గ్రామ పంచాయతీగా ఉన్న సందర్భంలో ఆయా సర్వే నెంబర్ల పరిధిలో విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నట్లుగా అప్పటి అధికారుల సంతకాలు, పంచాయతీ స్టాంప్‌లతో ఎస్‌ఎల్‌ఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పత్రాలను తయారు చేసింది. విల్లాలతో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ నిర్మించాలంటే హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోవాలి. కానీ, ఎస్‌ఎల్‌ఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు చెందిన వారు 65 విల్లాలకు మాత్రమే అనుమతులు తీసుకుని ఏకంగా 325 నిర్మించారు. అన్నింటికీ హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నట్లు స్థానిక అధికారులను నమ్మించారు. అనుమతులు లేకుండానే మూడేళ్లలో 260 విల్లాలను నిర్మించారు. ఒక్కో విల్లాను రూ.1.20కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. మల్లంపేటలోని కొత్త చెరువులోకి చొచ్చుకొస్తూ దర్జాగా విల్లాలను నిర్మిస్తుండడంతో ఇటీవలే ఇరిగేషన్‌ అధికారులు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోకి నిర్మాణాలు వచ్చాయని అభ్యంతరం తెలిపారు. ఏడు విల్లాలను తొలగించాలని ఆదేశించడంతోపాటు కొన్నింటిని అప్పటికప్పుడే ఎక్స్‌కవేటర్‌ తో కూల్చివేశారు. అయినా, పద్ధతి మార్చుకోని సదరు బిల్డర్‌ నిర్మాణాలను కొనసాగించారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ఆ సంస్థకు నెల రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. దీంతో తమ పనులను అడ్డకుంటున్నారని డెవలపర్‌ కోర్టుకెక్కారు. కోర్టు నోటీసుల నేపథ్యంలో డెవలపర్‌ చూపిస్తున్న అనుమతి పత్రాలపై ఇటీవల జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారి విచారణ జరిపారు. తప్పుడు పత్రాలను సృష్టించినట్లు, అక్రమంగా నిర్మిస్తున్నట్లు కలెక్టర్‌కు నివేదించారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాలతో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలను, బిల్డింగ్‌లను మున్సిపల్‌ కమిషనర్‌ పి. భోగీశ్వర్లు, టీపీవో సాయిబాబా ఆధ్వర్యంలో సీజ్‌ చేశారు. విల్లాలను సీజ్‌ చేస్తున్న సమయంలో బిల్డర్‌ గానీ, వారి అనుచరులు గానీ అక్కడికి రాలేదు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, బిల్డర్‌ మాకు విల్లాలను రిజిస్ట్రేషన్లు చేశారు. బ్యాంక్‌ రుణాలను తీసుకొని ప్రస్తుతం వాటి వాయిదాలను కూడా చెల్లిస్తున్నాం. ప్రస్తుతం విల్లాలను సీజ్‌ చేస్తే మా పరిస్థితి ఏంటి..?' అని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమపని తాము చేసుకుపోవడంతో కొనుగోలుదారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)