భేష్‌.. దక్షిణాఫ్రికా!

Telugu Lo Computer
0


దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ దేశం కొత్త వేరియంట్‌ను గుర్తించి వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. శనివారం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెడి పాండొర్‌తో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సికేషన్‌ ప్రక్రియపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్‌ను త్వరితగతిన గుర్తించిన శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమాచారాన్ని పంచుకోవడంలో పారదర్శకత ప్రదర్శించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ మొదట చైనాలో 2019 డిసెంబర్‌లో బయటపడింది. అయితే.. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ఆలస్యంగా ప్రపంచానికి వెల్లడించింది. దీంతో ప్రపంచదేశాలన్నీ కరోనా పంజాకి విలవిలలాడిపోయాయి. ఈ నేపథ్యంలోనే కరోనా సృష్టికి.. అనంతర పరిణామాలకు చైనానే కారణమని అమెరికా తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. కరోనా వ్యాప్తి గురించి కీలకమైన సమాచారాన్ని పంచుకోవడంలో చైనా తాత్సార్యం చేసిందని ఆరోపించింది. ఆ దేశం కరోనా విషయంలో మరింత పారదర్శకంగా ఉండి ఉంటే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వీలుండేదని అభిప్రాయపడింది. కరోనా మూలాలు ఆన్వేషించేందుకు అమెరికా ప్రయత్నించగా.. దీనికి చైనా సహకరించలేదు. ఈ క్రమంలో అమెరికా-చైనా మధ్య వైరం పెరిగింది. దీంతో గత కొంత కాలంగా ఇరు దేశాలు.. వాణిజ్యం, మానవ హక్కులు, తైవాన్‌కు సంబంధించిన విషయంలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)