కొన్ని కలలు, కన్నీళ్లు

Telugu Lo Computer
0





75 యేళ్ల స్వతంత్రభారతావనిలో ఇప్పటికీ చదువుకు డబ్బుకు అసుంట ప్రధాన వ్యవస్థ అంచులకు ఆవల పడి ఉన్న వాళ్ల ఉమ్మడి కల. ధర్మం న్యాయంగానే ఉండాలని ఆశించేవాళ్ల సామూహిక స్వప్నం. ధర్మానికి న్యాయానికి చట్టానికి కూడా కులం, డబ్బు, అధికారం, హోదా లాంటి కళ్లద్దాలు సత్యాన్ని చూడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాయో వ్యవస్థ నగ్న స్వరూపాన్ని చూపిన సినిమా జై భీమ్. ఈ సినిమా చూస్తున్నంత సేపూ మరో తమిళ సినిమా విశారణై (తెలుగులో విచారణ) గుర్తుకొస్తూనే ఉంటుంది. వ్యవస్థలో పాతుకుపోయిన క్రూరత్వాన్ని సటిల్‌గా కూడా చూపొచ్చు అని నిరూపించిన మరాఠీ సినిమా కోర్ట్ గుర్తుకొస్తుంది. దాదాపు 30 యేళ్ల క్రితం తెలుగులో ఉమామహేశ్వరరావు తీసిన అంకురం గుర్తుకొస్తుంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది, ఆ బీచ్ పాటలో ఫిజిక్స్ బాగా చూపించారు అని రొడ్డకొట్టుడు బండ కమర్షియల్ పరిభాషలో చెప్పుకునే సినిమా కాదు. అంచులకు ఆవల నెట్టివేయబడిన వాళ్ల ఆక్రందన. కూసింత ఆత్మగౌరవం కోసం పెనుగులాడే వాళ్ల బతుకు చిత్రం. పొలాల్లో ఎలుకలను పట్టి జీవనం సాగించే వాళ్లు తెలుగునాట ఉన్నారు. తీర ప్రాంతపు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. వారిది పాక్షికమైన సంచార జీవితం. అప్పట్లో ఆ కులాల్లో దొంగలు ఎక్కువగా ఉండేవారని ప్రతీతి. స్టువర్ట్‌పురం మీద కూడా ఆ ముద్ర ఉండేది. బ్రిటీష్ వారు నోటిఫైడ్ ట్రైబ్‌గా నేరపూరిత ట్రైబ్‌గా ముద్ర వేసిన జీవితాలు. స్వతంత్ర భారతంలో కంప్యూటర్ యుగంలో కూడా అదే ముద్రను మోస్తూ బతుకులీడుస్తున్న జీవితాలు. తమిళనాట వీరిని ఇరులర్ అని పిలుస్తారు. వారి జీవితాల్లో 1995లో జరిగిన ఘటన ఆధారంగా తీసిని సినిమా ఇది. తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు అనుభవాల ఆధారంగా ఆయన యాక్టివిప్ట్ లాయర్‌గా ఉన్న రోజుల్లో ఎదుర్కొన్న ఒక ప్రధాన కేసు నేపథ్యంగా నేరేట్ చేసిన స్టోరీ. దొంగతనం నేరం మోపి లాకప్‌లో చంపేసి ఆ తర్వాత ఆ కేసునుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని నేరాలకు పోలీసులు పాల్పడతారు, వారిని రక్షించడానికి ఎన్ని అంగాలు ఎట్లా పనిచేస్తాయి అనేది ఒక వైపు- చేయని నేరానికి భర్త లాకప్ డెత్ లో చనిపోయి సాక్షులుగా ఉన్న బంధువులు ఎక్కడో తెలీని జైలులో మగ్గుతుంటే భర్త ఏమయ్యాడో తెలీక యాతన పడే బాధిత మహిళ హక్కుల న్యాయవాది సహాయంతో ఈ శక్తిమంతమైన వ్యవస్థతో ఎలా పోరాడిందీ అనేది మరోవైపు- రెండు ప్రపంచాల సమాహారం. రెండు ప్రపంచాల మధ్య ఘర్షణ, హింస తాలూకు విశ్వరూపం

Post a Comment

0Comments

Post a Comment (0)