నిందితుల అరెస్ట్‌కు అమెరికా సాయం కోరిన భారత్‌

Telugu Lo Computer
0


భారత న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇద్దరి ఆచూకీ కనుగొనేందుకు అమెరికా అధికారుల సాయం కోరినట్లు సీబీఐ తెలిపింది. పంచ్‌ ప్రభాకర్‌గా పేరున్న సి.ప్రభాకర్‌ రెడ్డి, మణి అన్నపురెడ్డి అనే వారు అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం ఉందని గురువారం సీబీఐ తెలిపింది. వీరిపై దేశంలో కోర్టులు జారీ చేసిన అరెస్ట్‌ వారెంట్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్‌పోల్‌ సాయంతో అమెరికాలో వారుంటున్న ప్రాంతాన్ని గుర్తించి, వారిపై జారీ అయిన అరెస్ట్‌ వారెంట్ల వివరాలను అమెరికా అధికారులకు అందజేసినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మరో ఆరుగురిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో అక్టోబర్‌ 22వ తేదీన అరెస్ట్‌ చేసి, జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు సీబీఐ వెల్లడించింది. అంతకుముందు, ఇదే కేసులో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. మరో వ్యక్తిపై విచారణ కొనసాగుతోందని, అతడి యూట్యూబ్‌ చానెల్‌ను మూసివేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ 16 మంది నిందితులపై నమోదు చేసిన 12 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి 2020 నవంబర్‌ 11న కేసు నమో దు చేసినట్లు సీబీఐ తెలిపింది. అనంతరం సామాజిక మాధ్యమాల్లో జడ్జీలు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న పలు అభ్యంతరకర పోస్టులను తొలగించామని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)